Share News

Ranji Trophy: 3 సెంచరీలతో పరుగుల వరద పారించిన పుజారా.. సెలెక్టర్లు కరుణించేనా...

ABN , Publish Date - Feb 17 , 2024 | 09:37 PM

టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2024లో దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

Ranji Trophy: 3 సెంచరీలతో పరుగుల వరద పారించిన పుజారా.. సెలెక్టర్లు కరుణించేనా...

టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2024లో దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న పుజారా మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో పరుగుల వరద పారించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా తాజాగా మణిపూర్‌తో జరిగిన తమ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడిన పుజారా వన్డే తరహా బ్యాటింగ్‌తో సెంచరీ కొట్టాడు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఆశ్చర్యకరంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 196 బంతుల్లో 148 పరుగులు చేసిన జట్టు కెప్టెన్ అర్పిత్ వాసవాడ ఔట్ అయిన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. ప్రేరక్ మన్కడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 231 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ధాటిగా ఆడిన పుజారా 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 105 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారాకు ఇది 63వ సెంచరీ కావడం గమనార్హం. మరోవైపు మన్కడ్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 19 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 173 బంతుల్లో 173 పరుగులు చేశాడు.


ఈ రంజీ సీజన్‌లో పుజారా 11 ఇన్నింగ్స్‌లో 78 సగటుతో 781 పరుగులు చేశాడు. కాగా ఈ సీజన్‌లో పుజారా 243, 49, 43, 43, 66, 91, 3, 0, 110, 25, 108 పరుగులు చేశాడు. టీమిండియాలో స్థానం కోల్పోయిన పుజారా తిరిగి చోటు సంపాదించడమే లక్ష్యంగా పరుగుల వరద పారిస్తున్నాడు. 36 ఏళ్ల పుజారా చివరగా 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తాజా ప్రదర్శనతోనైనా పుజారాను సెలెక్టర్లు కరుణిస్తారేమో చూడాలి. ఇక మ్యాచ్ విషయానికొస్తే అర్పిత్ వాసవాడ, మన్కడ్, పుజారా సెంచరీలతో చెలరేగడంతో డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 529/6 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్‌పై సౌరాష్ట్రకు 387 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో మణిపూర్ 142 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో మణిపూర్ 55/3 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది.

Updated Date - Feb 17 , 2024 | 09:37 PM