Share News

Ranji Trophy: డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు వీరవిహారం

ABN , Publish Date - Feb 24 , 2024 | 08:13 PM

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.

Ranji Trophy: డబుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు వీరవిహారం

టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. అజేయ డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు. 128 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ముషీర్ ఖాన్ నేడు డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి సెంచరీనే ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీగా మలిచాడు. ఒకానొక దశలో 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబైని ముషీర్ ఆదుకున్నాడు. అంతేకాకుండా డబుల్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ స్కోర్ సాధించాడు. ముఖ్యంగా హార్దిక్ తమోర్‌తో(57) కలిసి ఆరో వికెట్‌కు 181 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. ముషీర్ ఖాన్‌కు చక్కటి సహకారం అందించాడు. మొత్తంగా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్ 18 ఫోర్లతో 203 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఇటీవల ముగిసిన అండర్ 19 ప్రపంచకప్ కప్‌లో కూడా ముషీర్ ఖాన్ సత్తా చాటాడు. 2 సెంచరీలతో చెలరేగాడు.


ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 384 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా ముంబై బ్యాటర్లలో పృథ్వీషా 33, సూర్యాంశు షెడ్జే 20 పరుగులు చేశారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్ 17, రహానే 3 పరుగులు మాత్రమే చేశారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో చెలరేగాడు. నినాద్ రథ్వ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. క్రీజులో శాశ్వత్ రావత్(69), కెప్టెన్ విష్ణు సొలంకి(23) ఉన్నారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో బరోడా జట్టు 257 పరుగులు వెనుకబడి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 08:16 PM