Rohit Sharma: ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:41 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి వైఫల్యమే దీనికి కారణం. అతడి స్కోర్ కార్డ్‌ను చూస్తే ఈ విమర్శల్లో పస ఉన్నదని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
IND vs AUS: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతడి వైఫల్యమే దీనికి కారణం. అడిలైడ్ టెస్ట్‌లో టీమిండియా ఘోర ఓటమితో ఇప్పుడు అందరూ హిట్‌మ్యాన్‌ను టార్గెట్ చేస్తున్నారు. బ్యాటర్‌గా అతడి ఫెయిల్యూర్ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. టెస్టులకు రోహిత్ సెట్ అవ్వడని.. లాంగ్ ఫార్మాట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని సిరీస్‌ల్లో అతడి స్కోర్ కార్డ్‌ను చూస్తే ఈ విమర్శల్లో పస ఉన్నదని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
ఒక్కటే ఫిఫ్టీ
ప్రస్తుత క్రికెట్‌లో రోహిత్ శర్మ బెస్ట్ ప్లేయర్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్లకు అతీతంగా అతడు అద్భుతంగా ఆడుతూ వస్తున్నాడు. అయితే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో టాప్ బ్యాటర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న హిట్‌మ్యాన్.. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. 6, 3, 11, 18, 8, 0, 52, 2, 8, 23, 5, 6.. గత 12 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లు ఇవి. ఇందులో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. సెంచరీ ప్రస్తావన కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
గర్జించని బ్యాట్
బ్యాటర్‌గా రోహిత్ రాణిస్తే.. టీమ్‌లోని ఇతర ఆటగాళ్లు కూడా తాము మరింత బాధ్యతతో ఆడాలని భావిస్తారు. తాను పరుగులు చేయడం ద్వారా ఇతర ప్లేయర్లకు హిట్‌మ్యాన్ ఉదాహరణగా నిలవాలి. కానీ అతడి బ్యాటే మూగబోతుంటే.. ఇంక మిగతా వారి సంగతి చెప్పనక్కర్లేదు. రోహిత్ త్వరగా ఔట్ అవడం వల్ల మిడిలార్డర్ బ్యాటర్లపై ప్రెజర్ పడుతోంది. దీని వల్ల జట్టు భారీ స్కోర్లు సాధించలేకపోతోంది. తాజా అడిలైడ్ టెస్ట్‌తో పాటు న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి అతడి బ్యాటింగ్ వైఫల్యం ఒక కారణమనే చెప్పాలి. ఈ ఫెయిల్యూర్స్ నుంచి అతడు బయటపడితే గానీ భారత్ మునుపటిలా విజయాల బాట పట్టలేదని అనలిస్టులు అంటున్నారు. మరి.. రోహిత్ ఏం చేస్తాడో చూడాలి.