Share News

Sarfaraz Khan: అరంగేట్రంలోనే సర్ఫరాజ్‌ రికార్డు.. ఇప్పటివరకు ఎంత మంది అందుకున్నారంటే..

ABN , Publish Date - Feb 20 , 2024 | 08:37 AM

రాజ్‌కోట్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు సంపాదించుకున్న 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.

Sarfaraz Khan: అరంగేట్రంలోనే సర్ఫరాజ్‌ రికార్డు.. ఇప్పటివరకు ఎంత మంది అందుకున్నారంటే..

రాజ్‌కోట్ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు సంపాదించుకున్న 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆడుతున్నది తొలి మ్యాచే అయినప్పటికీ ఏమాత్రం బెదురు లేకుండా బ్యాటింగ్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ధాటిగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 66 బంతుల్లోనే 62 పరుగులు చేసిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 72 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా.. మొత్తంగా 43వ ఆటగాడిగా నిలిచాడు.


సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందు టీమిండియా తరఫున దిలావర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, శ్రేయాస్ అయ్యర్ కూడా తమ అరంగేట్ర టెస్టుల్లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు సాధించారు. కాగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌పై 434 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తద్వారా భారత జట్టు తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 430/4 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకు ఆలౌట్ అయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 08:37 AM