Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025.. భారత్ మ్యాచ్‌లపై ఐసీసీ కీలక నిర్ణయం!
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:40 PM
వచ్చే ఏడాదిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఎనిమిది దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాయి. అయితే.. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా?
వచ్చే ఏడాదిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025) జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఎనిమిది దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాయి. అయితే.. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అనే విషయంపై ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ టోర్నీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు రావాల్సిందేనని పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మొదట్లో పట్టుబట్టగా.. తమ జట్టు పాక్‌లో అడుగుపెట్టదని, భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో (దుబాయ్ లేదా శ్రీలంకలో) నిర్వహించాలని బీసీసీఐ బదులిచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. బీసీసీఐ ప్రతిపాదనకు ఐసీసీ సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అదనపు నిధులు కేటాయించడమే సాక్ష్యం.
అదనపు నిధులు
పాకిస్తాన్‌కు టీమిండియాను పంపించే విషయంపై భారత ప్రభుత్వం నుంచి ఇంతవరకూ అనుమతి లభించలేదు. అసలు పర్మిషన్ దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. గతేడాదిలో ఆసియా కప్‌కు (Asia Cup 2023) పాకిస్తాన్ ఆథిత్యం ఇవ్వగా.. భారత జట్టుకి అక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ లభించలేదు. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తేనే వస్తామని తేల్చి చెప్పడంతో.. మరో దారి లేక శ్రీలంక వేదికగా భారత జట్టు మ్యాచ్‌లను నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్న తరుణంలో.. ఐసీసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. టీమిండియా మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్‌లో కేటాయించింది. ఈ లెక్కన.. హైబ్రిడ్ మోడల్‌లోనే భారత మ్యాచ్‌లను నిర్వహిస్తారని అర్థంచేసుకోవచ్చు.
ఐసీసీకే అప్పగింత
భద్రతా కారణాల దృష్ట్యా.. భారత జట్టు మ్యాచ్‌లను లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో నిర్వహించేలాగా పీసీబీ ఇప్పటికే షెడ్యూల్ నిర్వహించింది. తాము భారీ భద్రతా కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. అయినా.. పాక్‌కు వెళ్లేందుకు భారత్ సుముఖంగా లేదు. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపించేలా బీసీసీఐని ఒప్పించే బాధ్యతను ఐసీసీకి పీసీబీ అప్పగించింది. ఇటీవల కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో.. పన్ను విధివిధానాలు, వేదిక ఎంపికలు, భారత్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌కు సంబంధించిన వివరాలను ఐసీసీకి పీసీబీ సమర్పించినట్లు ఓ అధికారి తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్స్‌గా పీసీబీ చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేసిందని, మిగిలిందంతా ఐసీసీ చేతుల్లోనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
2008 నుంచి..
భారత జట్టు చివరిసారిగా 2008లో జరిగిన ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లింది. అంతే.. అప్పటి నుంచి మళ్లీ ఆ గడ్డపై కాలు మోపలేదు. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. పాకిస్తాన్‌కు వెళ్లేందుకు టీమిండియాకు అనుమతి లభించలేదు. దీంతో.. ఇరు దేశాల జట్లు కేవలం ఆసియా, ఐసీసీ ఈవెంట్లలోనే ఆడుతున్నాయి. గతేడాదిలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ కోసం.. పాక్ జట్టు భారత్‌కు వచ్చింది. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాక్‌కు వెళ్లొచ్చని అంతా అనుకున్నారు. కానీ.. బీసీసీఐ పాక్‌లో అడుగుపెట్టేదే లేదని తేల్చి చెప్పడంతో, హైబ్రిడ్ పద్ధతిలో భారత మ్యాచ్‌లను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
Read Latest Sports News and Telugu News