IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది ఆ రోజే..
ABN , Publish Date - Jan 04 , 2024 | 01:25 PM
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌నకు మరో 5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సారి పొట్టి ప్రపంచకప్‌నకు వెస్టిండీస్, అమెరికా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్‌లో జరిగే ఈ ప్రపంచకప్ షెడ్యూల్ గురించిన వార్తలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌నకు మరో 5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ సారి పొట్టి ప్రపంచకప్‌నకు వెస్టిండీస్, అమెరికా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్‌లో జరిగే ఈ ప్రపంచకప్ షెడ్యూల్ గురించిన వార్తలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. పలు నివేదికల ప్రకారం ఈ ప్రపంచకప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు లీగ్ దశలో ఒకే గ్రూపులో ఉండనున్నాయి. జూన్ 9న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత జట్టు లీగ్ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్‌తోపాటు యూఎస్‌ఏ, కెనడా జట్లతోనూ తలపడనుంది. భారత్, యూఎస్‌ఏ మ్యాచ్ జూన్ 12న న్యూయార్క్ వేదికగా జరగనుండగా.. కెనడాతో ఆడే మ్యాచ్ జూన్ 15న ఫ్లోరిడాలో జరగనుంది.
భారత జట్టు తమ లీగ్ మ్యాచ్‌లన్నింటిని అమెరికాలోనే ఆడాలని భావిస్తున్నట్టు సమాచారం. భారత్ కోరిక మేరకు మన జట్టు మ్యాచ్‌లన్నీ అమెరికాలో జరిగే విధంగా ఐసీసీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జూన్ 29న జరిగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా జరిగే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తమ జట్టును సిద్ధం చేసుకునే పనిలో ఉంది. ఈ టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడే అవకాశాలున్నాయి. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ సమయంలో మొత్తం 30 మంది ఆటగాళ్లను పర్యవేక్షించనున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.