Share News

IPL 2024: నన్ను కింగ్ అని పిలవొద్దు.. ఎందుకంటే..? కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 20 , 2024 | 09:59 AM

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. అలా పిలవడం తనకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు.

IPL 2024: నన్ను కింగ్ అని పిలవొద్దు.. ఎందుకంటే..? కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు. అలా పిలవడం తనకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాడు. ఆర్సీబీ ఉమెన్స్ టీం డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అన్‌బాక్స్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ పురుష, మహిళ జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి అభిమానులు భారీ ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఉమెన్స్ జట్టును ఈ కార్యక్రమంలో గార్డ్ ఆఫ్ ఆనర్‌తో గౌరవించారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ నిన్నో ప్రశ్న అడగాలని అనుకుంటున్నా.. నువ్వు చాలా రోజుల నుంచి మాట్లాడలేదు. కనిపించలేదు. ప్రస్తుతం కింగ్ ఎలా ఫీలవుతున్నాడు’’ అని అడిగాడు. ఈ ప్రశ్నకు కోహ్లీ స్పందించబోతుండగా స్టేడియంలోని అభిమానులు పెద్దగా అరిచారు. కింగ్ అంటూ స్టేడియం హోరెత్తిపోయింది.


ఈ క్రమంలోనో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘మనం చాలా త్వరగా చెన్నై చేరుకోవాలి. మాకు చార్టెర్డ్ ఫ్లైట్ ఉంది. ఎక్కువ సమయం కూడా లేదు. ముందుగా మీరు నన్ను ఆ పదం(కింగ్)తో పిలవడం మానేయండి. నేను ఫాఫ్‌తో కూడా ఇదే చెప్పాను. మీరు నన్ను అలా పిలిచినప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి దయయేసి ఇక నుంచి నన్ను విరాట్ అని పిలవండి. ఆ పదాన్ని ఉపయోగించొద్దు. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది.’’ అని చెప్పాడు.

విరాట్‌కు కింగ్ అనే పేరు ఎలా వచ్చింది?

విరాట్ కోహ్లీని తొలిసారిగా తానే కింగ్ అని పిలిచినట్టు ఆస్ట్రేలియాలో నివసించే టీమిండియా క్రికెట్ అభిమాని కునాల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వచ్చినప్పుడు కోహ్లికి జెర్సీని బహుమతిగా ఇవ్వాలని భావించినట్టు తెలిపాడు. దీంతో కింగ్ కోహ్లి అని రాసిన జెర్సీని ఇచ్చినట్లు చెప్పాడు. అప్పటి నుంచే అభిమానులు కూడా కోహ్లీని కింగ్ అని పిలుస్తున్నారు. పత్రికలు, మీడియా కూడా కోహ్లీని కింగ్ అని సంభోదిస్తూ వార్తలు రాస్తున్నాయి. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే స్టేడియాలైతే కింగ్ అనే నినాదాలతో మార్మోగిపోతున్నాయి. దీంతో కోహ్లీకి కింగ్ అనే పేరు స్థిరపడిపోయింది. కానీ తాజాగా కోహ్లీనే స్వయంగా తనను కింగ్ అని పిలవకూడదని చెప్పడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 09:59 AM