Suryapet: కుదరని బేరంలో చిక్కుకొని 16 ఎద్దుల మృతి..
ABN , Publish Date - May 30 , 2024 | 04:46 AM
అవి 26 జీవాలు! అందులో 24 ఎద్దులు, రెండు ఆవులున్నాయి! అన్నింటినీ ఒకే కంటెయినర్‌లో కుక్కేసి సూర్యాపేట నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇదొక్కెత్తయితే.. ఈ తరలింపును అడ్డుకున్న పోలీసులు, ఆ కంటెయినర్‌ను తెరవకుండా 13 గంటలపాటు అలాగే ఉంచారు. మండే ఎండకు లోపల గాలి ఆడక.. మేత లేక.. తాగేందుకు నీరూ లేక ఆ మూగజీవాలు తట్టుకోలేకపోయాయి.
సూర్యాపేట నుంచి తమిళనాడుకు26 మూగజీవాలతో కంటెయినర్
మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద అడ్డగింత 813గంటలపాటు వాటికి మేత, నీరూ లేదు
తెరిచి చూస్తే లోపల కళేబరాలే
తరలిస్తున్నవారికి, పోలీసులకు బేరం కుదరకపోవడమే కారణమా?
మఠంపల్లి, మే 29: అవి 26 జీవాలు! అందులో 24 ఎద్దులు, రెండు ఆవులున్నాయి! అన్నింటినీ ఒకే కంటెయినర్‌లో కుక్కేసి సూర్యాపేట నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇదొక్కెత్తయితే.. ఈ తరలింపును అడ్డుకున్న పోలీసులు, ఆ కంటెయినర్‌ను తెరవకుండా 13 గంటలపాటు అలాగే ఉంచారు. మండే ఎండకు లోపల గాలి ఆడక.. మేత లేక.. తాగేందుకు నీరూ లేక ఆ మూగజీవాలు తట్టుకోలేకపోయాయి. చివరికి.. ఆ కంటెయినర్‌ను తెరిచి చూసేసరికి 26 మూగజీవాల్లో 16 మృతిచెందాయి. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేటలో మంగళవారం తెల్లవారుజామున 4గంటలకు మూగజీవాలతో బయలుదేరిన కంటెయినర్‌ను మట్టపల్లి వంతెన చెక్‌పోస్ట్ వద్ద ఉదయం 9: 30కు పోలీసులు నిలిపివేశారు. లోపల మూగజీవాలు ఉన్నట్లు గుర్తించి కంటెయినర్‌ను పక్కన ఆపాలని సూచించారు.
అరగంట తర్వాత మఠంపల్లి ఎస్సై రామాంజనేయులుకు సమాచారం ఇవ్వగా, కంటెయినర్‌ను పక్కన ఉంచాలని ఆదేశించారు. సాయంత్రం వరకూ ఎండలోనే వాహనం నిలిపి ఉంచారు. సాయంత్రం 6 గంటలకు కంటెయినర్‌ను మఠంపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించాలని ఎస్సై ఆదేశించడంతో సిబ్బంది అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా రెండు గంటలపాటు చర్చలు సాగించారు. రాత్రి 8 గంటలకు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కంటెయినర్ డ్రైవర్ రామచంద్రన్, ఆ ప్రాంతానికే చెందిన దళారులు నటరాజన్, స్వామితోపాటు మరొకరిపై కేసు నమోదుచేసి ఆ వాహనాన్ని నల్లగొండలోని గోశాలకు తరలించారు. అప్పటిదాకా లోపలున్న మూగజీవాలకు కనీసం నీరు కూడా ఇవ్వలేదు. రాత్రి 11గంటలకు నల్లగొండలోని గోశాలకు తరలించి, కంటెయినర్ తెరిచి చూడగా.. అందులో 15 ఎద్దులు మృతి చెందాయి. అప్పటికి మరో రెండు కొన ఊపిరితో ఉన్నాయి. మిగతా తొమ్మిది మూగజీవాలను బుధవారం నల్లగొండ గోశాలలో వదిలారు. తర్వాత సీరియ్‌సగా ఉన్న రెండు ఎద్దుల్లో ఒకటి మృతిచెందగా, మరో ఎద్దును మట్టపల్లి గోశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు తెలిపారు. కాగా పోలీసులు, దళారుల మధ్య బేరసారాలు కొలిక్కి రాకపోవడం వల్లే అవి మృత్యువాత పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతిచెందాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. తాము వాహనాన్ని ఎలా తీసుకువచ్చామో అలానే ఉంచాలని పోలీసులు చెప్పారని, ఫలితంగా గంటల తరబడి కంటెయినర్‌లో నీళ్లు కూడా లేకుండా ఇవ్వకపోవడంతో మూగజీవాలు మృతిచెందాయని కంటెయినర్ డ్రైవర్ రామచంద్రన్ చెప్పాడు. మట్టపల్లి వంతెన వద్ద అక్రమంగా జీవాలను తరలిస్తున్న కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మఠంపల్లి ఎస్సైపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ నివేదిక ఇచ్చినట్లు విశ్వనీయమైన సమాచారం. ఎస్సై రామాంజనేయులు తన మొబైల్ ఫోన్ (గ్రూప్ నంబర్)ను స్టేషన్‌లోని సిబ్బందికి అందజేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఎస్పీ సీరియస్ అయినట్లు తెలిసింది.