Share News

Hyderabad: మురిసిన పుస్తకం

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:21 AM

‘ఈ కాలంలో పుస్తకాలు చదివేదెవ్వరు.?’ అన్నమాటలను పుస్తక మహోత్సవం పటాపంచలు చేసింది. పుస్తకాల పండుగకు అమితాదరణ లభించింది.

Hyderabad: మురిసిన పుస్తకం

  • హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో పాల్గొన్న జస్టిస్‌ రాధారాణి

  • శాశ్వత భవన నిర్మాణానికి సహకరిస్తానన్న ఎమ్మెల్సీ కోదండరాం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు29 (ఆంధ్రజ్యోతి): ‘ఈ కాలంలో పుస్తకాలు చదివేదెవ్వరు.?’ అన్నమాటలను పుస్తక మహోత్సవం పటాపంచలు చేసింది. పుస్తకాల పండుగకు అమితాదరణ లభించింది. దోమల్‌గూడ, ఎన్టీఆర్‌ స్టేడియంలో 11రోజుల పాటు సాగిన 37వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. 13 లక్షలమందికిపైగా ఈ ఏడాది పుస్తక మహోత్సవానికి వచ్చినట్లు సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్‌ చెప్పారు. అందులోనూ 35 ఏళ్లలోపు వారు అధిక సంఖ్యలో ఉండడం విశేషం. బుక్‌ ఫెయిర్‌ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ హాజరుకావడం, గ్రూప్‌-2 పరీక్షలు ముగియడంతో యువతకు కాస్త విరామం లభించడం, యువ రచయితలు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం తదితర కారణాలతో ఈ సారి యువత అధికసంఖ్యలో వచ్చారని కొందరు ప్రచురణకర్తలు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది 20నుంచి 30శాతం సేల్స్‌ పెరిగాయి.


పుస్తకాలతోనే సామాజిక మార్పు

బుక్‌ ఫెయిర్‌ ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి. రాధారాణి మాట్లాడుతూ... తుపాకుల ద్వారా సాధ్యం కాని సామాజిక మార్పును పుస్తకాల ద్వారా తీసుకురాగలమన్నారు. భావ విప్లవానికి ప్రధాన ప్రేరణ పుస్తక పఠనమని, ఆలోచనలను విస్తృతం చేయడంలోనూ దాని పాత్ర ప్రముఖమైనది అని అన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌, ఎంఎన్‌ రాయ్‌ లాంటి మహనీయులంతా పుస్తక పఠనం ద్వారానే వారి జీవితాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. మరో వక్త ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో చాలామంది పుస్తకాలు చదవడం మంచి పరిణామమన్నారు. బుక్‌ ఫెయిర్‌కు శాశ్వత భవనం ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందేలా తనవంతు ప్రయత్నిస్తానని హామీఇచ్చారు.

Updated Date - Dec 30 , 2024 | 04:21 AM