మోదీ-షాలది ఫాసిస్టు పాలనే!
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:35 AM
భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న నరేంద్రమోదీ-అమిత్‌షాల పాలన నిస్సందేహంగా ఫాసిస్టు (నియంత) పాలనేనని మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, మజ్దూర్ బిగుల్ పత్రిక సంపాదకుడు అభినవ్ సిన్హా పేర్కొన్నారు.
సదస్సులో మార్క్సిస్టు సిద్ధాంతవేత్త అభినవ్ సిన్హా స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న నరేంద్రమోదీ-అమిత్‌షాల పాలన నిస్సందేహంగా ఫాసిస్టు (నియంత) పాలనేనని మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, మజ్దూర్ బిగుల్ పత్రిక సంపాదకుడు అభినవ్ సిన్హా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘21వ శతాబ్దంలో ఫాసిజం: కొనసాగుతున్న అంశాలు, నూతన లక్షణాలు మరియు సమకాలీన శ్రామికవర్గ వ్యూహం’ అన్న అంశంపై ఏడవ అంతర్జాతీయ అరవింద్ మెమోరియల్ సెమినార్ ఆదివారం ప్రారంభమైంది. ఫాసిజానికి వ్యతిరేకంగా సమర్థవంతమైన శ్రామికవర్గ వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో అరవింద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మార్క్సిస్ట్ స్టడీస్ ఈ సెమినార్‌ను ఐదు రోజులపాటు నిర్వహిస్తోంది.
దీనికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాక అమెరికా, ఆస్ట్రేలియా, నేపాల్ తదితర దేశాల నుంచి కూడా వందలాది మంది ఉద్యమకారులు, విద్యావేత్తలు, మేధావులు హాజరయ్యారు. సెమినార్ తొలిరోజున అభినవ్ సిన్హా పత్ర సమర్పణ చేశారు. చారిత్రకంగా ఫాసిజంలో వెల్లడైన లక్షణాలను ఈ పేపర్ చర్చించింది. గత శతాబ్దంలో ఇటలీ, జర్మనీలలో ముందుకొచ్చిన ఫాసిజానికి, 21వ శతాబ్దంలో పుట్టిన ఫాసిజానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించింది. దేశంలో మోదీ-షాల పాలన ఫాసిస్టు పాలనేనని ఈ సందర్భంగా అభినవ్ పేర్కొన్నారు. పత్ర సమర్పణ అనంతరం ప్రతినిధులు ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు.