Share News

Abhishek Manu Singhvi: రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీయే

ABN , Publish Date - Aug 15 , 2024 | 03:49 AM

ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం ప్రకటించింది.

Abhishek Manu Singhvi: రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీయే

  • ప్రకటించిన ఏఐసీసీ ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం ప్రకటించింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబరు 3న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ విషయానికొస్తే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన కే కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి గత నెల 5న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.


ఫిబ్రవరిలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగగా.. శాసనసభలో కాంగ్రె్‌సకున్న సంఖ్యాబలాన్ని బట్టి రెండు సీట్లు దక్కాయి. వాటిలో ఒక సీటును ఏఐసీసీ తన కోటా కింద తీసుకోవాలని భావించినా.. ఇక్కడి సామాజిక సమీకరణాల దృష్ట్యా రెండు సీట్లనూ టీపీసీసీకే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అయిన సీటును ఏఐసీసీ కోటా కింద తీసుకుంది. సింఘ్వీని అభ్యర్థిగా నిర్ణయించింది. ప్రస్తుతం శాసనసభలో ఈ సీటుకు పోటీ పడే సంఖ్యా బలం ఏ పార్టీకీ లేనందున సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది.


అనంతరం సింఘ్వీ ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించనున్నారు. సింఘ్వీ పదవీ కాలం ఏప్రిల్‌ 9, 2026 వరకు (ఒక ఏడాది ఏడు నెలలు) ఉంటుంది. ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపిక చేసినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు విప్‌ను ఉల్లంఘించి బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. దాంతో సింఘ్వీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ఈ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన రోజే వార్త ప్రచురించింది. తనపై విశ్వాసంతో రాజ్యసభకు ఎంపిక చేసినందుకు సింఘ్వీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 15 , 2024 | 03:49 AM