Share News

Hyderabad: రూ.3లక్షలు ఇవ్వాల్సిందే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 03:18 AM

ఓ స్థలం వివాదానికి సంబంధించి నమోదైన కేసును మూసేయడానికి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ కుషాయిగూడ సీఐ, ఎస్సై సహా మరో మధ్యవర్తి ఏసీబీకి దొరికిపోయారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ జి.వీరస్వామి, ఎస్సై షేక్‌ షఫీతోపాటు మధ్యవర్తిత్వం నెరిపిన ఉపేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

Hyderabad: రూ.3లక్షలు ఇవ్వాల్సిందే..

  • కేసు మూసివేతకు కుషాయుగూడ సీఐ, ఎస్సై లంచం డిమాండ్‌

  • మధ్యవర్తి నుంచి డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

ఏఎ్‌సరావునగర్‌/హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): ఓ స్థలం వివాదానికి సంబంధించి నమోదైన కేసును మూసేయడానికి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ కుషాయిగూడ సీఐ, ఎస్సై సహా మరో మధ్యవర్తి ఏసీబీకి దొరికిపోయారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ జి.వీరస్వామి, ఎస్సై షేక్‌ షఫీతోపాటు మధ్యవర్తిత్వం నెరిపిన ఉపేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడలోని వాసవి శివనగర్‌ కాలనీలో సర్వే నంబర్‌ 199లో ఉన్న స్థలానికి సంబంధించి ఓ మహిళకు, స్థానికంగా నివాసం ఉండే సింగిరెడ్డి భరత్‌రెడ్డికి వివాదం నడుస్తోంది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు భరత్‌రెడ్డిపై ఏప్రిల్‌లో కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనపై కుషాయిగూడ పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ భరత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.


కోర్టు ఆదేశాల మేరకు 41ఏ సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత కేసును మూసివేయడానికి రూ.3లక్షలు ఇవ్వాలని, ఇందులో కొంత మొత్తం ఇన్‌స్పెక్టర్‌కూ ఇవ్వాల్సి ఉంటుందని ఎస్సై షఫీ చెప్పారు. కుషాయిగూడకు చెందిన ఉపేందర్‌ మధ్యవర్తిగా వ్యవహరించినా ఫలితం లేకపోయింది. దీంతో భరత్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయుంచారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... ఉపేందర్‌ రూ.3లక్షల నగదును శుక్రవారం ఈసీఐఎల్‌లోని బాధితుడి ఆఫీసులో తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ వీరస్వామి, ఎస్సై షఫీ సూచన మేరకే తాను డబ్బు తీసుకున్నట్లు ఉపేందర్‌ పేర్కొనడంతో వారినీ అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వరకు కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. ఇతర సిబ్బందినీ విచారించారు.

Updated Date - Jun 01 , 2024 | 03:18 AM