Share News

Agriculture: రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈవోలకు!

ABN , Publish Date - Jul 21 , 2024 | 02:58 AM

రుణమాఫీ పథకంలో తొలి జాబితాలో పేర్లులేని రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించే బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)కు అప్పగించారు.

Agriculture: రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈవోలకు!

  • వ్యవసాయ కమిషనరేట్‌ ఆదేశాలు

  • ఆన్‌లైన్‌ సదుపాయం లేకపోవడంతో

  • రిజిస్టర్లలో ఫిర్యాదుల నమోదు

  • ఆగస్టు 15 తర్వాతే సమస్యల పరిష్కారం

  • ఇంకా మాఫీ కాలే.. పైసలు తక్కువొచ్చాయ్‌!

  • ఆదిలాబాద్‌ జిల్లాలో రైతుల ఫిర్యాదులు

హైదరాబాద్‌, తలమడుగు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పథకంలో తొలి జాబితాలో పేర్లులేని రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించే బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)కు అప్పగించారు. ఫిర్యాదుల స్వీకరణకు సంబంధించి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎలాంటి కాలమ్‌ ఏర్పాటుచేయకపోవటంతో ఏఈవోలు రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ రుణమాఫీ కాకపోతే స్థానికంగా ఉండే వ్యవసాయ విస్తరణాధికారులకు ఫిర్యాదు లు చేయాలని వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఏఈవోలు రిజిస్టర్‌లో ఫిర్యాదులను నమోదుచేస్తున్నారు.


ఈ నెల 15న రుణమాఫీ మార్గదర్శకాలను విడుదలచేసినప్పుడే వ్యవసాయ శాఖ డైరెక్టర్‌, నేషనల్‌ ఇన్పర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) కలిసి ప్రత్యేక ఐటీ పోర్టల్‌ నిర్వహిస్తాయని జీవో (నం.567)లో పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను ఐటీ పోర్టల్‌లోగానీ, మండలస్థాయిలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాల వద్ద తెలపాలని సూచించారు. ప్రతి అభ్యర్థనను అధికారు లు 30రోజుల లోపు పరిష్కరించి, దరఖాస్తుదారులకు తెలపాలని జీవోలో పేర్కొన్నారు. ఐటీ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్‌ అకౌంట్‌ డేటా సేకరణ, డేటా వాలిడేషన్‌, అర్హత మొత్తాన్ని నిర్వహించే సౌకర్యాన్ని పొందుపరిచారు. అదేక్రమంలో రైతులిచ్చే ఫిర్యాదులు పరిష్కరించటానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్‌ ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పోర్టల్‌లో మాడ్యూల్స్‌ ఏవీ పొందుపరచలేదు. ఏఈవోలు, ఏవోలకు ఎలాం టి మాడ్యూల్స్‌ పంపలేదు.


వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయాల నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలమేరకు ఏఈవోలు ప్రతి క్లస్టర్‌లో ఒక రిజిస్టర్‌ తీసుకొని మా న్యువల్‌గా నమోదుచేస్తున్నారు. రైతు పేరు, ఆధార్‌ నంబరు, పాస్‌బుక్కు, బ్యాంకు ఖాతా వివరాలు రిజిస్టర్‌లో నమోదుచేసి పెడుతున్నా రు. రైతులిచ్చిన ఫిర్యాదులు మాత్రం క్లస్టర్‌ పరిధిలోనే ఉంటున్నాయి. డీఏవో, డైరెక్టర్‌ కార్యాలయానికి పంపాలని ఆదేశాలు రాకపోవటంతో ఏఈవోలు రిజస్టర్‌లో రాసి తమవద్దే పెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొస్తే పంపిస్తామని చెబుతున్నారు. అధికారవర్గాల సమాచారం మేరకు ఫిర్యాదులపై ఆగస్టు 15 తర్వాతే దృష్టిసారించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రూ.లక్ష వరకు విడుదలచేసిన నిధు లు రైతుల ఖాతాల్లో పడుతున్నాయా? బ్యాం కుల్లో సమస్యలు ఎదురవుతున్నాయా? చిన్న చిన్న సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించాలి? తొలి విడత జాబితాలో పేర్లు వచ్చిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎలా చేర్చాలి? అనే అంశంపైనే దృష్టిసారిస్తున్నారు.


కాగా ప్రతిబ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్‌ అధికారి(బీఎన్‌వో)గా నియమించాలని, ఎన్‌ఐసీకి, వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌కు సమన్వయకర్తగా బీఎన్‌వో వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్యాంకు పంట రుణాల డేటాపై బీఎన్‌వోతో డిజిటల్‌ సంతకంచేయించారు. కానీ, బ్యాంకులో ఉండే బీఎన్‌వోలు రైతుల ఫిర్యాదులను మాత్రం స్వీకరించటంలేదు. తమకు రూ.లక్షలోపు లోను ఉన్నదని, అయినా మాఫీ రాలేదని, కారణాలేంటో తెలపాలని రైతులు బ్యాంకులను సంప్రదిస్తే... వ్యవసాయ అధికారుల వద్దకే వెళ్లాలని చెబుతున్నారు. కాగా, మండల వ్యవసాయఅధికారి రుణమాఫీ అమలుకు నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించాలని ఈనెల 18న డీఏవోలు ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఏవోలు ఈ సమస్యలపై దృష్టిపెట్టడంలేదనే విమర్శలొస్తున్నాయి. కొన్నిజిల్లాల్లో కలెక్టర్లు చొరవతీసుకొని కలెక్టరేట్లలో టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేశారు. జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌కు ఈ ఫిర్యాదులు పంపించి, సమీక్షిస్తామని, రాష్ట్రస్థాయిలో పరిష్కరించేటివి ఉంటే ఎస్‌ఎల్‌బీసీకి పంపిస్తామని కలెక్టర్లు చెబుతున్నారు.


కొందరు రైతుల్లో ఆందోళన

తమకు ఇంకా రుణమాఫీ కాలేదని కొందరు.. ఉన్న రుణం కన్నా తక్కువ మాఫీ అయిందని ఇంకొందరు ఇలా ఆదిలాబాద్‌ జిల్లాలో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు వారు జిల్లాలోని తలమడుగు గ్రామానికి చెందిన రైతులు శనివారం బ్యాంకు వచ్చిన జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్యకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయలని విన్నవించుకున్నారు. రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని, బ్యాంకర్ల సహకారంతో జరిగిన తప్పులను సరిదిద్ది రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని పుల్లయ్య పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు.

Updated Date - Jul 21 , 2024 | 02:58 AM