Share News

CBI special court: వివేకా హత్య కేసులో దస్తగిరి సాక్షే

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:32 AM

ఏపీ మాజీ సీఎం జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకాను హత్య చేసిన నలుగురిలో నాలుగో నిందితుడు(ఏ-4)గా ఉన్న షేక్‌ దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తున్నట్లు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

CBI special court: వివేకా హత్య కేసులో దస్తగిరి సాక్షే

  • ఆయన పిటిషన్‌ను అనుమతించిన సీబీఐ కోర్టు

  • ఎంపీ అవినాశ్‌రెడ్డి సహా ఇతర నిందితులకు ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ సీఎం జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకాను హత్య చేసిన నలుగురిలో నాలుగో నిందితుడు(ఏ-4)గా ఉన్న షేక్‌ దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తున్నట్లు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. ఈ మేరకు తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి రఘురాం అనుమతించారు. అభియోగాలు నమోదు చేసే వరకు దస్తగిరిని నిందితుడిగా కాకుండా సాక్షిగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు.


వివేకా హత్య కేసు హైదరాబాద్‌కు బదిలీ కాకముందే దస్తగిరిని కడప కోర్టు అప్రూవర్‌గా గుర్తించింది. దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచే ఈ కేసు కీలక మలుపులు తిరిగింది. తాజాగా దస్తగిరిని సీబీఐ కోర్టు సాక్షిగా గుర్తించడం అవినాశ్‌రెడ్డి, ఇతర నిందితులకు శరాఘాతంగా మారింది. ఈ కేసులో గూగుల్‌ టేకౌట్‌, కాల్‌డేటా, ఎలక్ర్టానిక్‌ ఎవిడెన్స్‌ కంటే దస్తగిరి సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది. నిందితులు సైతం దస్తగిరి సాక్ష్యం తప్ప మరే ఇతర ఆధారాలు లేవని పదేపదే ఆరోపిస్తున్న తరుణంలో వారికి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిణమించింది.

Updated Date - Jul 26 , 2024 | 05:32 AM