ఆశలు రేకెత్తిస్తున్న పత్తి
ABN , Publish Date - Aug 27 , 2024 | 10:53 PM
పత్తి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆరుతడి పంటైన పత్తికి అడపదడప కురుస్తున్న వర్షాలతో కాలం కలిసివస్తోంది. అదనులో విత్తనాలు పడటంతో పత్తి పంట 70 నుంచి 90 రోజుల వయ సులో ఉంది. ఎలాంటి చీడపీడల బెడద లేకుండా ఏపుగా పెరుగుతూ గూడ కట్టి పూతకు వస్తోంది.
నెన్నెల, ఆగస్టు 27: పత్తి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆరుతడి పంటైన పత్తికి అడపదడప కురుస్తున్న వర్షాలతో కాలం కలిసివస్తోంది. అదనులో విత్తనాలు పడటంతో పత్తి పంట 70 నుంచి 90 రోజుల వయ సులో ఉంది. ఎలాంటి చీడపీడల బెడద లేకుండా ఏపుగా పెరుగుతూ గూడ కట్టి పూతకు వస్తోంది. ఇప్పటి వరకు పంట బాగుందని, పరిస్థి తులు ఇలాగే కొనసాగితే పత్తిలో మంచి దిగుబడులు రావడంతో పాటు ఆశించిన ధర లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తుండటంతో రెట్టింపు ఉత్సాహంగా సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
జిల్లాలో వరి కంటే పత్తి పంటనే ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. చేలతో పాటు మామిడి తోటల్లో అంతర పంటగా కూడా పత్తి పండిస్తు న్నారు. ఇంటి పెరళ్లల్లో సైతం మక్కకు బదులు పత్తి వేస్తున్నారు. చాలా మంది రైతులు తమ సొంత చేలతోపాటు కౌలుకు భూములు తీసుకొని పత్తి సాగు చేస్తున్నారు. వరికి బదులు వాణిజ్య పంటైన పత్తిని ప్రోత్స హించాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో పత్తి పంట విస్తీర్ణం పెంచేందుకు అధికారులు కూడా కృషి చేశారు. పల్లెల్లో సదస్సులు ఏర్పాటు చేసి సాగు విస్తీర్ణం పెంచాలని ప్రచారం చేశారు. ఫలితంగా గతేడాది కంటే జిల్లాలో ఈ ఏడు మరో 30 వేల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. సీజన్‌లో జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగ వుతోంది. గతేడాది ఆశించిన దిగుబడులు రావడం, పత్తికి మంచి ధర పలకడంతో రైతులు ఆసక్తి చూపించారు. ఈయేడు సైతం కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను క్వింటాలుకు రూ.501లు పెంచింది. రూ.7,020 నుంచి రూ.7,521లకు ధర పెరగడంతో ఎక్కువ మంది రైతులు పత్తి సాగువైపు మొగ్గు చూపారు.
అనుకూలంగా వాతావరణం
ఆరుతడి పంటైన పత్తికి ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉంది. అతి వృష్టి, అనావృష్టి కాకుండా అప్పుడప్పుడు వానలు కురుస్తుండటం పత్తి పంటకు కలిసి వస్తోంది. ఎక్కువ వర్షం వస్తే చేలు జాలు వారి మొక్కల పెరుగుదల ఉండదు. కలుపుతోపాటు చీడ పీడల బెడద అధికంగా ఉంటుంది. మోస్తరు వర్షాలతో చేలల్లో ప్రస్తుతం గుంటుకలు నడుస్తున్నాయి. చేలో గుంటుక సాగితే కలుపు నివారణలో రైతులకు 60శాతం ఖర్చు ఆదా అవుతుంది. దౌర కొట్టి సులువుగా కలుపు నివారిం చుకుంటున్నారు. పైపాటు ఎరువులు వేసుకొని, పూత నిలిచేందుకు మందులు పిచికారి చేస్తున్నారు. మొదటి రెండు నెలలు వాతావరణం అనుకూలిస్తే పత్తి పంటకు ఢోకా ఉండదని రైతులంటున్నారు. పొడి వాతావరణం ఉంటే చీడపీడలు కూడా అంతగా ఆశించవని చెబు తున్నారు. ప్రస్తుతం పనులన్ని అదనులోగా పూర్తవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో, చీడపీడల నుంచి పంటను రక్షించుకుంటే దిగుబడులు చేతికి వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.