Tiger Attack: ఆ జిల్లా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి.. మరోసారి రైతుపై దాడి..
ABN , Publish Date - Nov 30 , 2024 | 01:07 PM
జిల్లాలో పెద్దపులి మరోసారి దాడి చేసింది. సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది.
కొమురం భీం: జిల్లాలో పెద్దపులి మరోసారి దాడి చేసింది. సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. రైతు సురేశ్ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల రైతులు అప్రమత్తమయ్యారు. అంతా కలిసి గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. పులి దాడిలో సురేశ్ మెడకు తీవ్రగాయాలు కాగా.. తోటి రైతులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఓ మహిళపై దాడి చేసి చంపిన 24 గంటల వ్యవధిలోనే మరో దాడి జరగడంతో జిల్లావాసులు పులి భయంతో వణికిపోతున్నారు.
కాగా, మనుషుల రక్తం మరిగిన పెద్దపులి శుక్రవారం నాడు కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌లో వ్యవసాయ పనులకు వెళ్లిన మోహిర్లె లక్ష్మి అనే యువతిపై దాడి చేసి చంపేసింది. గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి తోటి మహిళలతో కలిసి పత్తి చేలో పని చేసేందుకు శుక్రవారం ఉదయం నజ్రూల్ నగర్ గ్రామానికి వెళ్లింది. అయితే పత్తి ఏరుతుండగా అక్కడే మాటు వేసిన పులి ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. మెడ భాగాన్ని కరవడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. దాడిని గమనించిన తోటి కూలీలు కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. బాధితురాలిని గ్రామస్థులంతా కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకుని అటవీ శాఖ కార్యాలయం ఎదుట కుటుంబసభ్యులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. అయితే పులి దాడిలో యువతి మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
మరోవైపు కొమురం భీం జిల్లాలో పులి దాడిపై తెలంగాణ అటవీ శాఖ అధికారులు నిన్ననే అలర్ట్ అయ్యారు. శుక్రవారం దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ అమలు చేశారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, సిర్పూర్(టి) మండలంలోనూ పులి దాడి సంచలనంగా మారింది.