Tummala: బాధిత రైతులను ఆదుకుంటాం
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:35 AM
భారీ వర్షాలు, వరదలతో పంటలు కోల్పోయిన రైతులు అధైర్య పడవద్దని, నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకుంటామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
సర్వే పూర్తయిన వెంటనే పరిహారం పంపిణీ
మున్నేరు బాధితులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల
ఖమ్మం, మధిర రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలతో పంటలు కోల్పోయిన రైతులు అధైర్య పడవద్దని, నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకుంటామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. మున్నేరు వరదలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేసి మెరక ప్రాంతలో నిర్మిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలంలో పలు గ్రామాలను, ఖమ్మం బొక్కలగడ్డలో మున్నేరు వరద ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను గురువారం ఉదయం మంత్రి తుమ్మల సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయనకు మధిర మండలం చిలుకూరు, ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామాల రైతులు తమ సమస్యలను వివరించారు. తుమ్మల మాట్లాడుతూ రైతుల సమస్యలు తెలుసుకొనేందుకే తాను వచ్చానని, ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. మున్నేరు వాగు బాధితులకు ఇంటింటికీ నిత్యావసరాలు, దుస్తులు, పాల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బొక్కలగడ్డలో ప్రతి గల్లీ తిరిగి వరద నష్టాన్ని పరిశీలించారు. తాము సర్వం కోల్పోయామని మంత్రి తుమ్మలకు మహిళలు తమ గోడు వినిపించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని, నిత్యావసర వస్తువులు మీ ఇంటివద్దకే చేరతాయని భరోసా ఇచ్చారు.