Air Pollution: వణికిస్తున్న వాయు కాలుష్యం!
ABN , Publish Date - Nov 25 , 2024 | 02:57 AM
రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయులకు గాలి నాణ్యత
చలి, పొగమంచు, ధూళితో సమస్యలు
సనత్‌నగర్‌లో 311కు పీఎం 2.5 కణాలు
ఈ నెలలో 8సార్లు 150.. అంతకు మించి
వాయుకాలుష్యంతో ఆరోగ్యంపై ప్రభావం
చిన్నారులు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సనత్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 311కు పడిపోయింది. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరగడంతో బొల్లారం, హెచ్‌సీయూ, ఇక్రిశాట్, పాశమైలారం వంటి ప్రాంతాల్లో ఎక్యూఐ ప్రమాదకరస్థాయులకు చేరుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో గాలిలో నాణ్యత ప్రమాణాలు పడిపోతుండటం, పెరుగుతున్న కాలుష్యం కారణంగా భవిష్యత్‌లో ఢిల్లీ తరహా పరిస్థితులు హైదరాబాద్‌లో ఏర్పడే ప్రమాదముంటుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని అని.. వాయు నాణ్యత తగ్గితే చిన్నారులు, వయోవృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
50లోపు ఉంటే..
నగరాల్లో వాయు నాణ్యత సూచీ 0-50 మధ్యలో ఉంటే గాలి నాణ్యత బాగునన్నట్లని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ.. గాలిలో వ్యాపించే కొన్ని రకాల వాయువులు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా వాయు నాణ్యత పడిపోతుందని పర్యావరణ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గాలిలో నాణ్యత తగ్గిపోతున్నా.. నివారణకు కాలుష్య నియంత్రణ బోర్డు ఎలాంటి చర్యలూ చేపట్టట్లేదనే విమర్శలున్నాయి. అయితే.. కాలుష్య నియంత్రణ అధికారులు మాత్రం హైదరాబాద్‌లో వాయు కాలుష్యం అంత ప్రమాదకరస్థాయిలో లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌లో 14 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లున్నాయని, గంట గంటకూ వాటి ద్వారా వాయు నాణ్యత వివరాలు సేకరిస్తునట్లు తెలిపారు. 14 కేంద్రాల సమీపంలో ఎక్కడైనా ఎదైనా కాల్చినప్పుడు వచ్చే పొగ వల్ల ఆ సమయంలో మాత్రమే గాలి నాణ్యత తగ్గుతుందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వివరించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో సమీర్ యాప్‌లో నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలు ప్రతి ఒక్కరు చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ధూళి లెక్కలు
గాలిలో సూక్ష్మ దుమ్ము, ధూళికణాలు (పర్టిక్యులేట్ మేటర్) పీఎం అంటారు. 2.5 మైక్రో మీటర్ల కన్నా తక్కువగా ఉండే వాటిని పీఎం 2.5గా, 10 మైక్రో మీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే దూళి కణాలను పీఎం 10గా వ్యవహరిస్తారు. పీఎం 2.5, పీఎం 10 కణాలు గాలిలో ఎక్కువ సేపు ఉంటాయి. గాలి ద్వారా ముక్కులోకి, తర్వాత గొంతు ద్వారా శ్వాసకోశాల్లోకి చేరతాయి. వాటివల్ల శ్వాశకోశ సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
ఊపిరితిత్తులపై ప్రభావం
గాలిలో నాణ్యత తగ్గితే ద్విచక్రవాహనాలపై వెళ్లే వారి ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కుగా పడుతుంది. ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. చలికాలంలో పొగమంచు దట్టంగా ఏర్పడి.. భూమికి ఒక కిలోమీటర్ ఎత్తున అది ఆగిపోయి ఒక పొరలా ఏర్పడి కాలుష్యం పెరిగేందుకు కారణంగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- ధర్మరాజు, వాతావరణ శాస్త్రవేత్త
వాయు నాణ్యత ఇలా..
రాజధాని నగరంలో ఆదివారం
పలు ప్రాంతాల్లో నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (సాయంత్రం 6-7 గంటల సమయంలో)
ప్రాంతం పీఎం.2.5 పీ.ఎం 10
సనత్‌నగర్ 311 -
సోమాజిగూడ 194 105
బొల్లారం 189 153
ఇక్రిశాట్ 185 157
హెచ్‌సీయూ 182 149
జూ పార్కు 182 158
పాశమైలారం 185 158
ఈ నెలలో ఎనిమిది సార్లు..
సనత్‌నగర్ ప్రాంతంలో వాయునాణ్యత ఈ నెలలో 8సార్లు ఆందోళనకరస్థాయులకు చేరింది. ఎప్పుడెప్పుడంటే..
తేదీ-నెల పీ.ఎం.2.5
స్థాయులు
నవంబరు 18 242
నవంబరు 19 311
నవంబరు 20 307
నవంబరు 21 283
నవంబరు 22 316
నవంబరు 23 320
నవంబరు 24 311