Medical Association: ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యుల దాడి..
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:34 AM
బదిలీలను అడ్డుకునేందుకు తనపై ప్రభుత్వ వైద్యుల సంఘానికి చెందిన ముగ్గురు వైద్యులు దాడికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోఠీలోని డీఎంఈ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద శేఖర్ అనే డాక్టర్ ధర్నా నిర్వహించారు.
కోఠిలోని డీఎంఈ ఆఫీసు వద్ద శేఖర్ అనే వైద్యుడి ధర్నా
ముగ్గురు వైద్యులు తనపై దాడి చేశారని ఫిర్యాదు
శేఖర్‌పై వైద్యుల సంఘం నాయకులు కూడా..
మంగళ్‌హట్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): బదిలీలను అడ్డుకునేందుకు తనపై ప్రభుత్వ వైద్యుల సంఘానికి చెందిన ముగ్గురు వైద్యులు దాడికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోఠీలోని డీఎంఈ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద శేఖర్ అనే డాక్టర్ ధర్నా నిర్వహించారు. సాధారణ వైద్యుల బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు వ్యవహరించాలని డీఎంఈకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తనపై వైద్యులు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేశ్, రాథోడ్, వినోద్ కుమార్ దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని శేఖర్ సుల్తాన్‌బజార్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో నగరంలో కొందరు వైద్యులు తిష్ట వేశారని.. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. బదిలీల ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని భావించే ముగ్గురు వైద్యులు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు శేఖర్ వెల్లడించారు. మరోవైపు డాక్టర్ శేఖర్‌పై తెలంగాణ వైద్యుల సంఘం నాయకులు, వైద్యులు బి.రమేశ్, లాలూ ప్రసాద్, వినోద్, పల్లం ప్రవీణ్, నరహరి, వసంత్, రజనీకాంత్, రంగాచారి సుల్తాన్‌బజార్ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా శేఖర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని... పెట్రోల్ పోసి తగులబెడతానని డాక్టర్ శేఖర్‌తో పాటు ఆయన సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని పేర్కొన్నారు.