Share News

Maheshwar Reddy: ఎన్నుకున్న ఎమ్మెల్యే పార్టీ మారితే ప్రజలేం చేయాలి

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:37 AM

ప్రజలు ఐదేళ్ల కోసం తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి ప్రజాభీష్టానికి విరుద్ధంగా పార్టీ మారితే వారు ఏం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

Maheshwar Reddy: ఎన్నుకున్న ఎమ్మెల్యే పార్టీ మారితే ప్రజలేం చేయాలి

  • వారి హక్కులకు భంగం కలగకూడదంటే.. అనర్హతపై తక్షణ నిర్ణయం తీసుకోవాలి ..హైకోర్టులో ఏలేటి

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు ఐదేళ్ల కోసం తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వ్యక్తి ప్రజాభీష్టానికి విరుద్ధంగా పార్టీ మారితే వారు ఏం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌లో సింగిల్‌ జడ్జి తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె. శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది జె. ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే పార్టీ మారడం వల్ల ఓటు వేసిన ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని పేర్కొన్నారు.


మన దేశంలో సరిగా పనిచేయని ప్రజాప్రతినిధులను ‘రీకాల్‌ ’ చేసే అవకాశం లేదు.. కాబట్టి ప్రజలు తమ హక్కులను పరిరక్షించుకోవడానికి ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజల హక్కులకు భంగం కలగకూడదనే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్‌ వేగంగా నిర్ణయం తీసుకోవాలని పొందుపర్చారని పేర్కొన్నారు. స్పీకర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తున్న ‘కైశం మేఘాచంద్రసింగ్‌ ’ తీర్పు ప్రామాణికం కాదు అనే వాదనలో పస లేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆర్టికల్‌ 141 లేదా 142ఏ అధికరణ కింద తీర్పు ఇచ్చినా శిరోధార్యమేనని.. ఫలానా ఆర్టికల్‌ కింద తీర్పు ఇచ్చారు కాబట్టి వర్తించదు అనే వాదన నిలబడదని పేర్కొన్నారు. ప్రతివాదుల వాదనలు ముగిసిన నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ప్రత్యుత్తరం ఇవ్వడానికి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Updated Date - Nov 12 , 2024 | 04:37 AM