Share News

Allu Arjun: నాపై తప్పుడు ఆరోపణలు!

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:13 AM

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు కారణం అల్లు అర్జునేనని.. ఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరూ బాధితులను పరామర్శించలేదని..

Allu Arjun: నాపై తప్పుడు ఆరోపణలు!

  • అవాస్తవాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు

  • నేను అక్కడ ఎలాంటి రోడ్‌ షో, ఊరేగింపూ చేయలేదు

  • అభిమానులకు థాంక్యూ చెప్పేందుకే కారులోంచి చేతులూపా

  • థియేటర్‌ నుంచి బయటకెళ్లాలని పోలీసులు నాకు చెప్పలేదు

  • థియేటర్‌ సిబ్బంది చెప్పగానే అక్కడి నుంచి బయటికొచ్చేశాను

  • జరిగిన ఘోరం గురించి మరుసటిరోజు తెలిసి షాక్‌ అయ్యాను

  • నేను ఆస్పత్రికి వెళ్దామనుకున్నా లీగల్‌ టీమ్‌ వద్దని వారించింది

  • నాకు శ్రీతేజ్‌ వయసున్న కొడుకున్నాడు.. నేనెందుకు బాధపడను?

  • బాధిత కుటుంబానికి అండగా ఉంటా.. మీడియాతో అల్లు అర్జున్‌

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటకు కారణం అల్లు అర్జునేనని.. ఘటన జరిగిన తర్వాత సినీ ప్రముఖులు ఎవరూ బాధితులను పరామర్శించలేదని.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ శనివారం అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా.. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని.. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇందులో ఎవరి తప్పూ లేదు. ఇలా జరిగినందుకు బాధిత కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. వారికి జరిగిన నష్టానికి నా ప్రగాడ సంతాపం. శ్రీతేజ్‌ అతి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వారికి జరిగిన నష్టం పట్ల నా మనసంతా బాధతో నిండిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా వాడిగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే ముఖ్య కర్తవ్యంగా భావిస్తానని ఆయన తెలిపారు. ‘‘మిమ్మల్ని నవ్విస్తూ ఉంచాలనుకుంటాను. మీ మనసుల్ని గెలిచి థియేటర్‌ నుంచి బయటకు పంపిద్దామనుకుంటాను. నాకు థియేటర్‌ ఒక గుడిలాంటిది. అలాంటి చోట ఈ ప్రమాదం జరగడం బాధాకరం. ఈ విషయంలో నాకంటే బాధపడేవాడుండడు. నేను గంటగంటకూ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నాను. మంచి విషయం ఏంటంటే తను కదులుతున్నాడు.. కొంచెం కొంచెం కోలుకుంటున్నాడని తెలిసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది ఊరటనిచ్చే విషయం’’ అని పేర్కొన్నారు.


అయితే, ఈ విషయంలో తనపై కొన్ని తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం అవుతున్నందునే పత్రికా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బహుశా కమ్యూనికేషన్‌ లోపం వల్లే తనపై ఈ తప్పుడు ప్రచారం జరుగుతుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నన్ను ఈ ప్రమాదం విషయంలో పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నేను ఎవర్నీ నిందించడం లేదు. ఏ డిపార్టుమెంటునీ, ప్రత్యేకించి ఏ రాజకీయ నాయకుడిని, ప్రభుత్వాన్ని అనడం లేదు. నిజానికి మాకు సినిమా విషయంలో ప్రభుత్వం ఎంతో సాయం చేసింది. ప్రత్యేక టికెట్‌ రేట్‌ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వం విషయంలో చాలా సంతృప్తితో ఉన్నాను. ఇది ఎవ్వరినీ ఉద్దేశించి కాదు. నాపై జరుగుతున్న ప్రచారం.. క్యారెక్టర్‌ ఎసాసినేషన్‌ (వ్యక్తిత్వ హననం) గురించిమాత్రమే నేను స్పష్టతనివ్వాలనుకుంటున్నాను’’ అని స్పష్టం చేశారు. ‘‘నన్ను మీరంతా 20 ఏళ్లుగా చూస్తున్నారు. నేను ఎప్పుడైనా ఇలా నిర్లక్ష్యంగా ఉన్నానా? ప్రీమియర్‌ రోజు ఈ ఘటన జరిగాక సినిమా ప్రమోషన్స్‌ కోసం హాజరు కాలేకపోయా. ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ అన్నింటినీ రద్దుచేసుకున్నా. దాదాపు 15 రోజుల నుంచి ఎక్కడికీ పోలేదు. ఇంట్లోనే విచారంగా ఉండిపోయాను. నేను మూడేళ్లు కష్టపడి చేసిన ఈ సినిమాను ఇప్పటివరకూ థియేటర్‌లో చూడలేదు’’ అని ఆవేదన వెలిబుచ్చారు.


ఎప్పుడూ ఇలా జరగలేదు..

ఈ ప్రమాదం విషయంలో తన తప్పేమీ ప్రత్యక్షంగా లేదని సర్దిచెప్పుకొంటున్నానని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. ‘‘ఇటువంటి సమయంలో నేను ఇలా అన్నాను.. అలా అన్నాను.. కాళ్లూచేతులూ విరిగిపోయినా ఫర్లేదన్నానంటూ నా వ్యక్తిత్వాన్ని జాతీయ మీడియా ముందు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లకుపైగా నా సినిమాలతో పాటు ప్రతి సినిమాకూ నేను ఈ థియేటర్‌కే వెళ్లేవాణ్ని. ఎప్పుడూ ఏ ప్రమాదం జరగలేదు. ఈ సినిమా నా మూడేళ్ల కష్టం. అందుకే థియేటర్లో అభిమానులతో చూడాలనుకున్నాను. నేను నిర్లక్ష్యంతో థియేటర్‌కు వెళ్ళానని.. పర్మిషన్‌ లేకుండా వెళ్లాలనేది తప్పుడు సమాచారం. థియేటర్‌ వారు పర్మిషన్‌ తీసుకుని ఉంటారనే అక్కడికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక పోలీసులు దారి క్లియర్‌ చేస్తున్నారు. దాంతో పర్మిషన్‌ ఉందనే ముందకు వెళ్తున్నాం. ఒకవేళ పర్మిషన్‌ లేకుంటే పోలీసులు ముందస్తుగా చెప్పేవారు అనే ఆలోచనతో మేం ఉన్నాం. నాపై ఆరోపణలు వచ్చినట్లు నేను అక్కడ ఎటువంటి రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు. చేతులు కూడా ఎందుకు ఊపానంటే.. కొద్ది దూరం వెళ్లాక అక్కడ ట్రాఫిక్‌ బ్లాక్‌ అయిపోయింది. కారులో ఉన్న నేను బయటకి రాకుంటే అభిమానులు బాధ పడతారని బయటకి వచ్చి చేతులు ఊపా. ఒక్కసారి అయినా వారికి కనిపించి ‘ఽథాంక్యూ’ చెప్పడానికి అలా చేయాల్సి వచ్చింది. లేదంటే.. కారులోంచి బయటకు రాకుండా దాక్కున్నానని వారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు.


చేతులు ఊపితే అయినా ముందుకు వెళ్లడానికి దారి ఇస్తారని అలా చేశాను. నేనే కాదు, ప్రతీ ఒక్క లీడర్‌, సెలబ్రిటీ చేసే పనే అది’’ అని వివరణ ఇచ్చారు. థియేటర్లోకి వెళ్లాక కూడా పోలీసులు తనను సంప్రదించలేదని.. ఏం చెప్పలేదని.. సినిమా చూస్తుండగా థియేటర్‌ సిబ్బంది వచ్చి ‘బయట ప్రజలను అదుపుచేయలేని స్థితి, దయచేసి వెళ్లిపోండి’ అని చెప్పారని.. దీంతో తాను బయటకు వచ్చేశానని స్పష్టం చేశారు. ‘‘ఆ తర్వాతి రోజే నాకు ఓ మహిళ చనిపోయారని.. బాలుడికి పరిస్థితి విషమంగా ఉందని తెలిసి షాక్‌ అయ్యా’’ అని చెప్పారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే బన్నీవాసుకు ఫోన్‌ చేసి.. హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించినట్టు తెలిపారు. తాను థియేటర్‌కు వస్తానంటే వాసు వద్దన్నారని.. అయినా వినకుండా ఆస్పత్రికి వెళ్దామనుకుంటే తన లీగల్‌ టీమ్‌ వారించిందని వెల్లడించారు. ఆ పరిస్థితిలో ఏమి చేయాలో తోచకే.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వీడియో చేసినట్టు చెప్పారు. ‘‘నాకు విషయం తెలిసినా నేను థియేటర్లోనే ఉన్నానని అంటున్నారు. అలా నిజంగా, తెలిసి ఉంటే, ఆ క్షణమే థియేటర్‌ నుంచి నా భార్య, పిల్లలతో బయటకు వచ్చేసేవాణ్ని. అభిమానుల విషయంలో నేను ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటానని అందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు నేరుగా అభిమానులను స్వయంగా వెళ్లి కలిశాను. కష్టాల్లో ఉన్న చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ అభిమానుల్ని కలిసేవాణ్ని. అలాంటిది నా అభిమాని కుటుంబానికి ఇలా జరిగితే ఎందుకు పట్టించుకోను. అదీ నా సినిమా విషయంలో ఓ కుటుంబానికి ఇంత జరిగితే నేను వెళ్లి ఎందుకు కలవను?’’ అని ప్రశ్నించారు.


పరిస్థితులు చేతులు కట్టేశాయి..

బాలుడి విషయంలో తాను స్పందించలేదని అంటున్నారని.. కానీ, పరిస్థితులు, లీగల్‌ విషయాలే తన చేతులను కట్టి పడేశాయని వాపోయారు. తాను వెళ్లకున్నా.. తన తండ్రి అరవింద్‌ను, దర్శకుడు సుకుమార్‌ను, లీగల్‌ టీమ్‌ను పంపి అక్కడి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించానని చెప్పారు. మానసికంగా తాను చాలా దృఢంగా ఉంటానని.. కానీ ఇప్పుడు తనపై జరుగుతున్న ప్రచారం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను అసలు సినిమాలు చేసేదే తెలుగువారు గర్వించేలా మంచి పేరు, గుర్తింపు తెద్దామని. అలాంటిది మనల్ని మనం కిందికి లాక్కోవాలనుకోకూడదు. నేను శ్రీతేజ్‌ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నానని అంటున్నారు. నిరంతరం శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి.. తన బాగోగుల గురించి నేను దర్శకుడు సుకుమార్‌తో చర్చిస్తూనే ఉన్నా. ఆ బాలుడి విషయంలో చేయాల్సింది చేసి చేతులు దులిపేసుకోకుండా.. నేను, సుకుమార్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు వై.రవి శంకర్‌, నవీన్‌ యెర్నేని అంతా కలసి బాలుడి కోసం ఓ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఏర్పాటు చేద్దామని.. ఫిజియోథెరపిస్టును పెట్టిద్దామని అనుకున్నాం. అయినా నేను కేర్‌ తీసుకోవడం లేదు అంటుంటే బాధగా ఉండదా? నాకు శ్రీతేజ్‌ వయసున్న అబ్బాయి ఉన్నాడు.


నేను ఎందుకు ఆ అబ్బాయి విషయంలో ఫీల్‌ అవ్వను?’’ అని అల్లు అర్జున్‌ ప్రశ్నించారు. శ్రీతేజ్‌ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని.. వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం, ఆయన తండ్రి అల్లుఅరవింద్‌ మాట్లాడారు. ‘‘సినిమా ఇంతటి విజయం సాధించినా.. ఈ దురదృష్టకర సంఘటన వల్ల మా అబ్బాయి ఇంట్లోనే కూర్చుండిపోయాడు. తన అభిమానుల కుటుంబానికి ఇలా జరిగినందుకు అర్జున్‌ తట్టుకోలేకపోతున్నాడు. 22ఏళ్లు కష్టపడి తను ఈ పేరు సంపాదించుకున్నాడు. మూడు తరాలుగా మమ్మల్ని చూస్తున్నారు. మేం ఎటువంటి వాళ్లమో మీకు తెలుసు. ఒకవేళ తప్పుంటే మీ నుంచి తప్పించుకోలేము. అటువంటిది ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతున్నందుకే ఈ ప్రెస్‌ మీట్‌ పెట్టి వివరణ ఇవ్వాలనుకున్నాం’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీతేజ్‌కు అందివ్వాల్సిన సహాయం గురించి అర్జున్‌తో, టీమ్‌, ‘పుష్ప 2 చిత్ర నిర్మాతలతో చర్చించి త్వరలోనే అన్ని విషయాలూ చెబుతానని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 03:14 AM