Mulugu: ‘అంగన్‌వాడీ’తో పిల్లల భవితకు పునాది: సీతక్క
ABN , Publish Date - Jul 16 , 2024 | 03:54 AM
పసిప్రాయం నుంచే అక్షరాభ్యాసం చేయించాలనే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల భవిష్యత్‌కు పునాది వేస్తున్నామని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
ములుగు రూరల్ జూలై 15: పసిప్రాయం నుంచే అక్షరాభ్యాసం చేయించాలనే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లల భవిష్యత్‌కు పునాది వేస్తున్నామని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మ మాట-అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని ములుగు జిల్లాలోని మహ్మద్‌గౌ్‌సపల్లిలో మంత్రి సోమవారం ప్రారంభించారు. 3-5 ఏళ్ల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించి వారికి విద్య నేర్పించేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలో పిల్లలకు ఆట వస్తువులు, పౌష్టికాహారంతో పాటు యూనిఫాం అందజేస్తోందని తెలిపారు.
పేద పిల్లలకు పౌష్టికాహారం, విద్య, భద్రత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులోని ఎర్రిగట్టమ్మ గుడి వద్ద ఎకో పార్క్‌లో మంత్రి సీతక్క మొక్కలు నాటారు. వన మహోత్సవం లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం వన దేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల చేత విరివిగా మొక్కలు నాటిస్తామన్నారు. ‘మొక్కలతో మొక్కులు చెల్లిస్తాం’ అనే నినాదంతో పని చేస్తామని తెలిపారు.