Gurukul school: పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థి మృతి
ABN , Publish Date - Aug 10 , 2024 | 04:26 AM
అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఇద్దరు గురుకుల విద్యార్థులను తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
అర్ధరాత్రి ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత
తెల్లవారుజామున ఆస్పత్రికి తరలింపు
ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
టీచర్ల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణ
మెట్‌పల్లి రూరల్, ఆగస్టు, 9: అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఇద్దరు గురుకుల విద్యార్థులను తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఎలమాడల అనిరుధ్ (11), జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మొండి మోక్షిత్ గురుకులంలో ఆరోతరగతి చదువుతున్నారు. వీరిద్దరూ గురువారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి నిద్రపోయారు.
అయితే అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో పీఈటీ వెళ్లగా.. కడుపు నొప్పిగా ఉందని అనిరుధ్, మోక్షిత్‌లు తెలిపారు. దీంతో వెంటనే కేర్‌టేకర్‌లు, అనిరుధ్ తల్లికి ఫోన్‌లో సమాచారం ఇచ్చి వారిని కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అనంతరం విషమంగా ఉందని తెలపడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పతికి తీసుకెళ్లారు. అప్పటికే విషయం తెలిసి వైద్యుడు కూడా అయిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్.. విద్యార్థులు పాము కాటుకు గురై ఉండవచ్చని అందుకు తగిన వైద్యం చేయాలని ఆర్మూర్‌లో వైద్యులకు సూచించారు.
అక్కడ వైద్యం అందించి నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అనిరుధ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మోక్షిత్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. ఇటు పాఠశాలలో ప్రార్థనా సమయంలోనే ఆరో తరగతి చదువుతున్న హేమంత్ అనే మరో విద్యార్థి కూడా కళ్లు తిరుగుతున్నాయని కింద పడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, 2 వారాల క్రితం ముగ్గురు విద్యార్థులు ఇదే విధంగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స అనంతరం ఇద్దరు కోలుకోగా.. 8వ తరగతి చదివే ఆర్.గణాధిత్య (13) మృతి చెందాడు. అయితే వీరు పాము కాటుకు గురైనట్లు సమాచారం.
ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం..
విద్యార్థి అనిరుధ్ మృతి విషయం తెలిసి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గురుకులానికి చేరుకున్నారు. విద్యార్థి మృతికి కారణాలేంటని అక్కడి ఉపాధ్యాయులు ప్రశ్నించారు. అయితే తమకేం తెలియదని వారు సమాధానం చెప్పడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, విద్యార్థుల వరుస మరణాలకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో వసతులు సరిగా లేవని.. తమ పిల్లల భద్రత మాటేంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.