Share News

Polavaram Project: పోలవరం ముంపుపై సంయుక్త సర్వే!

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:20 AM

పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) దాకా నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి (డీమార్కేషన్‌కు)గాను సర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముందుకొచ్చింది.

Polavaram Project: పోలవరం  ముంపుపై  సంయుక్త సర్వే!

  • ముర్రేడువాగు, కిన్నెరసాని వాగులకే పరిమితం!

  • ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయం.. నలుగురు అధికారులకు బాధ్యతలు

  • సర్వేతో పాక్షిక ప్రయోజనమేనంటున్న తెలంగాణ

  • బచావత్‌ ట్రైబ్యునల్‌ అనుమతులకు విరుద్ధంగా పోలవరండిజైన్‌ అని ఆరోపణ

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ఠ నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) దాకా నీటిని నిల్వ చేస్తే.. తెలంగాణ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి (డీమార్కేషన్‌కు)గాను సర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముందుకొచ్చింది. ఇందుకోసం నలుగురు అధికారులకు బాధ్యతలు కట్టబెడుతూ ఆ సమాచారం తెలంగాణకు ఇచ్చింది. తెలంగాణ కూడా సమ్మతి తెలిపి, తగిన తేదీలు ప్రకటిస్తే వెనువెంటనే సర్వే, డీమార్కేషన్‌ ప్రక్రియ ముందుకు కదిలే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉంటే.. తెలంగాణలోని కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీరు గోదావరిలోకి సాఫీగా ప్రవహించదు. గోదావరిలో కలిసేందుకు వీల్లేకపోతే ఈ వరద.. పంట పొలాలను ముంచెత్తుతుంది. దీంతో ఈ ముంపు ఏ మేరకు ఉంటుందో సర్వే చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు కూడా 2022 సెప్టెంబరు 6న ఇదే తీర్పు వెలువరించింది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగి.. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఆ తర్వాత సీడబ్ల్యూసీ పలు సమావేశాలు నిర్వహించి, ముంపు ప్రాంతాలను గుర్తించాల్సిందేనని ఆదేశాలిచ్చింది. మరోవైపు 2022లో భారీ వరదలతో ఈ సమస్య మరింత తీవ్రమయింది. వాస్తవానికి 2021 ఏప్రిల్‌ 17 నుంచి 29 దాకా జాయింట్‌ సర్వే జరిగినప్పటికీ క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్‌ చేయలేదు. దాంతో తాజా నిర్ణయంతో మరోమారు సర్వేతోపాటు డీమారే ్కషన్‌ ప్రక్రియ ముందుకు కదలనుంది.


పాక్షిక ప్రయోజనమే...

సంయుక్త సర్వే, డీమార్కేషన్‌తో పాక్షిక ప్రయోజనమే కలగనుంది. ముంపు ప్రభావం తీవ్రంగానే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. 1986లో 27 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. భద్రాచలం వద్ద 76.5 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించిందని, తిరిగి 2022 ఆగస్టులో 24.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా 71 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవహించిందని గుర్తు చేసింది. 1986 వరద కన్నా 2022లో వచ్చిన వరద తక్కువే ఉన్నప్పటికీ ముంపు తీవ్రత అధికంగా ఉందని, ఏకంగా 106 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 16 వేల ఇళ్లు నీటమునిగాయని తెలిపింది.


తెలంగాణ అభ్యంతరాలు ఇవీ..

  • గోదావరి ఉపనదుల ప్రవాహాన్ని కూడా పోలవరం బ్యాక్‌వాటర్‌ అడ్డుకోనుంది. భద్రాచలం వద్ద గోదావరికి కుడి, ఎడమ వైపున ప్రవ హించే కిన్నెరసాని, ముర్రేడువాగు, పెద్దవాగు, ఎద్దులవాగు, పాములేరువాగు, తుర్బాగవాగులు గోదావరిలో కలవకుండా ఆ ప్రవాహం వెనక్కితన్నితే వందలాది ఎకరాల మేర భూములు నీట మునుగుతాయి. 60 గ్రామాలపై ఆ ప్రభావం ఉంటుంది.

  • పోలవరం ప్రాజెక్టును.. 36 లక్షల క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా విడుదల చేసే సామర్థ్యంతో 140 అడుగుల ఎత్తులో కట్టేలా బచావత్‌ ట్రైబ్యునల్‌ అనుమతినిచ్చింది. కానీ, నిర్మాణంలో మాత్రం స్పిల్‌వే సామర్థ్యాన్ని 36 లక్షల నుంచి 50 లక్షలకు పెంచారు. అదీ 140 అడుగుల ఎత్తులో నుంచే 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా డిజైన్‌ చేశారు.

  • 1988లో ఏపీఈఆర్‌ఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌ వాటర్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ) నివేదికలో గోదావరికి 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని ఉండగా, 2009లో సీకో నివేదికలో 40 లక్షల క్యూసెక్కుల దాకా వరద రావచ్చని ఉంది. అదే 2021లో సీడబ్ల్యూసీ మాత్రం 28 లక్షల నుంచి 36 లక్షల క్యూసెక్కుల దాకా వరద రావచ్చని నివేదిక ఇచ్చింది. 2019లో ఐఐటీ రూర్కీ నివేదిక 58 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చునని పేర్కొంది. ఆయా సంస్థల నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నందున ముంపుపై స్వతంత్ర అధ్యయనం అవసరం.

  • 1990కి ముందున్న నదీ స్వభావం ఆధారంగా ఉన్న పరిస్థితులతో అధ్యయనాలు జరిగాయి. కాలానుగుణంగా నదీ గర్భంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వీటినీ పరిగణనలోకి తీసుకొని తాజాగా వరదపై అధ్యయనం జరగాలి. పోలవరం రిజర్వాయర్‌లో నీటి నిల్వ ఉన్న సమయంలో 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే.. పోలవరం ప్రాజెక్టు నుంచి వెనుకకు 146 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం దాకా ముంపు ప్రభావం ఉంటుంది.

Updated Date - Dec 24 , 2024 | 04:20 AM