Khammam: మెడికోకు గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:41 AM
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండుకొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు.
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘటన
అంతర్గత విచారణ చేపట్టిన అధికారులు
ఖమ్మం కలెక్టరేట్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మెడికోకు అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండుకొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు గోప్యంగా విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు. కళాశాల హాస్టల్‌లో ఉంటున్న ఈ విద్యార్థి ఈనెల 12న రాత్రి చైనీస్ స్టైల్‌లో హెయిర్ కటింగ్ చేయించుకుని వచ్చాడు. సెకండియర్ విద్యార్థులు అది బాగోలేదని చెప్పడంతో మళ్లీ వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుని వచ్చాడు. ఆ విద్యార్థి వచ్చేసరికి హాస్టల్‌లో యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయాన్ని తెలుసుకుని కోపోద్రిక్తుడయ్యారు.
ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటికి తీసుకెళ్లి సెలూన్ షాప్‌లో గుండుగీయించినట్లు తెలిసింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మెడికో రాత్రికి రాత్రే కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆ ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాంటీ రాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను 13న అక్కడి నుంచి తప్పించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటికి పొక్కింది. దీంతో ఘటనపై మరింత విచారణ నిర్వహించేందుకు నలుగురితో కమిటీని వేశామని, నివేదికను డీఎంఈకి పంపిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.