Share News

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:48 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తర్వాత అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెండున్నర గంటల వ్యవధిలో 70 ఇళ్లను నేలమట్టం చేశారు.

Mahbubnagar: పాలమూరులో అర్ధరాత్రి ఆపరేషన్‌

  • రెండున్నర గంటల్లో 70 ఇళ్ల కూల్చివేత

  • పెద్దఎత్తున మోహరించిన పోలీసులు..

  • బాధితుల్లో దివ్యాంగులు.. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

మహబూబ్‌నగ ర్‌, ఆగస్టు 29: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తర్వాత అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రెండున్నర గంటల వ్యవధిలో 70 ఇళ్లను నేలమట్టం చేశారు. కొన్నిటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా, ఇంకొన్నింటి పునాదులను తొలగించారు. పట్టణంలోని సర్వే నంబర్‌ 523 ఆదర్శనగర్‌లో దళారులు నకిలీ పట్టాలు సృష్టించి 75 నుంచి 100 గజాల చొప్పున విక్రయించారన్న ఫిర్యాదులున్నాయి.


ఈ స్థలాలు కొన్న కొందరు నిర్మాణాలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 3:30కు పోలీసులు, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు సంయుక్తంగా రంగలోకి దిగి.. తాళాలు వేసిన ఇళ్ల కూల్చివేత చేపట్టారు. ఆర్డీవో, డీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని స్టేషన్‌లకు చెందిన వంద మందికి పైగా పోలీసులను మోహరించారు. పడగొట్టిన ఇళ్లలోని సామగ్రి, ఫర్నిచర్‌ కూడా దెబ్బతిన్నాయి. ఉదయం 6 గంటలకల్లా యంత్రాలు, పోలీసులు వెళ్లిపోయారు.


కాగా, కూల్చినవాటిలో.. కళ్లు లేని, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు చెందిన ఇళ్లు కూడా ఉన్నాయి. వారు అక్కడకు చేరుకుని విలపించడం అందరినీ కలచివేసింది. ఆదర్శనగర్‌లో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలు ఇది నాలుగోసారి. తమకు పట్టాలున్నాయని, పన్ను చెల్లిస్తున్నామని, నోటీసులు లేకుండా ఎలా కూల్చివేస్తారని బాధితులు ప్రశ్నించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని వాపోయారు. పింఛన్‌ డబ్బులు దాచుకుని నిర్మాణాలు చేపట్టామని దివ్యాంగులు చెప్పారు. మరోవైపు కూల్చివేసిన ఇళ్లను మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ గురువారం సాయంత్రం పరిశీలించారు. బాధితులను పరామర్శించారు.

Updated Date - Aug 30 , 2024 | 04:48 AM