Celebrations: ఘనంగా బతుకమ్మ..
ABN , Publish Date - Oct 09 , 2024 | 04:33 AM
బతుకమ్మ ఉత్సవాలు మంగళవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, సిరిసిల్ల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ ఉత్సవాలు మంగళవారం పలుచోట్ల ఘనంగా జరిగాయి. సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఉత్సవాలకు సీఎస్ శాంతి కుమారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, దాండియా, బతుకమ్మ ఆట పాటల మధ్య సాగిన ఈ ఉత్సవాలలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాణీ ప్రసాద్, సచివాలయ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా అధికారులు, సిబ్బంది తాము రూపొందించిన బతుకమ్మల్ని ఒకచోట చేర్చి ఆట, పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
టీజీవో భవన్‌లో వేడుకల్లో మంత్రి సీతక్క
నాంపల్లిలోని టీజీవో భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క సందడి చేశారు. చెరువులకు పూజలు చేసే పండుగగా బతుకమ్మను నిర్వహించుకునేవారిమని ఆమె తెలిపారు. తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
వేములవాడలో సద్దులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ఏడో రోజులకు ఇక్కడ సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. బతుకమ్మ తెప్ప వద్ద నిర్వహించిన ఉత్సవాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. వేములవాడ మూలవాగులో నిర్వహించిన బతుక మ్మ వేడుకల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురా లు విమలక్క పాల్గొన్నారు. కాగా, గురువారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై దాదాపు 10 వేల మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.