Share News

G. Kishan Reddy: రేవంత్‌ రెడ్డి పాలనలో... అనాథలా హైదరాబాద్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:08 AM

సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో హైదరాబాద్‌ అనాథలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌ రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలిలో నిధులు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

G. Kishan Reddy: రేవంత్‌ రెడ్డి పాలనలో... అనాథలా హైదరాబాద్‌

  • జీహెచ్‌ఎంసీ, జలమండలిలో నిధుల లేమి

  • వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు

  • రేవంత్‌రెడ్డి పాలనలో ఇదీ పరిస్థితి

  • కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శలు

  • రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష

  • జీహెచ్‌ఎంసీ, జలమండలిలో నిధుల లేమి

  • సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • రేషన్‌ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

రాంనగర్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో హైదరాబాద్‌ అనాథలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌ రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలిలో నిధులు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాకు 80 శాతం నిధులు హైదరాబాద్‌ నుంచే వస్తున్నా సీఎం జీహెచ్‌ఎంసీకి నిధులు కేటాయించడం లేదని, ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ బడ్జెట్‌ను హైదరాబాద్‌ అభివృద్ధికే కేటాయించాలన్నారు. నిధులు లేక జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయలేకపోతోందని, బస్తీలు, కాలనీలు అంధకారంలో ఉన్నాయన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు అనేక పనులు మధ్యలోనే నిలిపివేశారన్నారు. బుధవారం కిషన్‌ రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గంలో పర్యటించారు.


పలు బస్తీలు, కాలనీల్లో తిరిగి ఓటేసి గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, కలుషిత నీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్లు వంటి సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా.. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన రామకృష్ణ నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్‌ ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని, దాంతో పేద ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోయారనిచెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని చెప్పిన రేవంత్‌.. నేడు కేసీఆర్‌ బాటలోనే నడుస్తున్నారన్నారు. వెంటనే అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలన్నారు.


రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేపట్టిన పలు ప్రాజెక్టుల ప్రగతిని బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్షించారు. దిల్‌కుషా అతిథి గృహంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌తో సమావేశమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రారంభించిన పలు రైల్వే ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. సికింద్రాబాద్‌, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Jul 11 , 2024 | 04:09 AM