Share News

BJP: రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరపాలి

ABN , Publish Date - Oct 28 , 2024 | 03:40 AM

జన్వాడ ఫాంహౌ్‌సలో రేవ్‌ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫాంహౌస్‌ ఎవరిదైనా దర్యాప్తు జరపాల్సిందేనన్నారు.

BJP: రేవ్‌పార్టీపై సమగ్ర దర్యాప్తు జరపాలి

  • ఫాంహౌస్‌ ఎవరిదైనా వదలొద్దు: కిషన్‌రెడ్డి

  • బావమరిది ఫంక్షన్‌కి కేటీఆర్‌ వెళ్లలేదా?

  • సుద్దపూస.. ఇప్పుడేమంటాడో?: సంజయ్‌

  • సుద్దపూస.. ఇప్పుడేమంటాడో?

  • కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌లోనే రేవ్‌ పార్టీలా?

  • పోలీసులే టిల్లును తప్పించారు: బండి సంజయ్‌

  • రేవంత్‌, కేటీఆర్‌ కుమ్మక్కయ్యారు: రఘునందన్‌

హైదరాబాద్‌/గజ్వేల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జన్వాడ ఫాంహౌ్‌సలో రేవ్‌ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫాంహౌస్‌ ఎవరిదైనా దర్యాప్తు జరపాల్సిందేనన్నారు. రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరగాలని, చట్టాన్ని తనపని తాను చేసుకోనివ్వాలని ప్రభుత్వానికి సూచించారు. దొంగ వీడియోలు తీసి దేశవ్యాప్తంగా జడ్జిలకు పంపిన చరిత్ర ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా ఇప్పుడు తమపై డ్రగ్స్‌ కేసులు అక్రమంగా పెడుతున్నారంటూ పెడబొబ్బలు పెడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఫాంహౌస్‌ ఫైల్స్‌ పేరిట ఐదు గంటల పాటు సినిమా చూపించారని గుర్తుచేశారు.


నాడు కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోగా, ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు సామూహికంగా దోచుకుంటున్నారని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన పది నెలల్లో జరిగిన ఒప్పందాలు, చేసిన అప్పులు, ఆస్తుల వివరాలతో మొత్తం ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక్క హామీని కూడా అమలు చేయలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, లక్షా యాభై వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామంటూ ఎగిరెగిరి పడుతోందని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందంటూ కేసీఆర్‌ పదేళ్లు మాట్లాడగా.. ఇప్పుడు సీఎం రేవంత్‌ కూడా అదే పల్లవి ఎత్తుకున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు.


  • సుద్దపూస.. ఇప్పుడేమంటాడో..?: సంజయ్‌

జన్వాడ ఫాంహౌ్‌సలో రేవ్‌ పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ట్విటర్‌ టిల్లు సహా ఆయన కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులను సీజ్‌ చేయాలని, ఈ కేసు నుంచి ట్విటర్‌ టిల్లును, ఆయన కుటుంబ సభ్యులను తప్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీసీ ఫుటేజీలను వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. ట్విటర్‌ టిల్లు బామ్మర్ది ఫాంహౌస్‌ ‘రేవ్‌ పార్టీ’ కేసును నీరుగార్చే కుట్ర మొదలైందని సంజయ్‌ ఓ ప్రకటనలో ఆరోపించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వాళ్లు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలిసిందని.. కొందరు పోలీసులు కావాలనే టిల్లును తప్పించారని ఆరోపించారు. హోంశాఖ సీఎం వద్దే ఉన్నా ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని తాము చెబుతున్నది నిజమేనని మరోసారి రుజువైందన్నారు.


‘‘తెలంగాణలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మారుస్తామన్న ప్రభుత్వ ప్రకటనలన్నీ డొల్లేనా? డ్రగ్స్‌ రహిత రాష్ట్రమంటే కేటీఆర్‌ కుటుంబ సభ్యులను తప్పించడమేనా?’’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ‘‘అక్రమ నిర్మాణాలంటూ పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించిన ట్విటర్‌ టిల్లు ఫాంహౌ్‌సను ఇంతకాలం ఎందుకు కూల్చలేదు? జన్వాడ ఫాంహౌ్‌సలో దాచుకున్న ముఖ్యమైన ఫైళ్లన్నీ ఓ స్టార్‌ హోటల్‌కు తరలించారు. ఈ విషయం తెలిసినా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? టిల్లు బామ్మర్ది ఫాంహౌ్‌సలో జరిగిన రేవ్‌ పార్టీలో ఆయన కుటుంబ సభ్యులున్నా ఉద్దేశపూర్వకంగా తప్పించారు.


డ్రగ్స్‌ దొంగలు పారిపోయేలా చేశారు. దానికి సహకరించిన వ్యక్తులెవరు? ఇది పక్కా డ్రగ్స్‌ పార్టీయే. ట్విటర్‌ టిల్లు.. ఏమీ ఎరగనట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం చిత్తుశుద్ధితో విచారణ జరిపితే ఆయన చావు తెలివి తేటలు బయటపడతాయి’’ అని సంజయ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో సహా రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ‘‘మీ సొంత బామ్మర్ది ఇంటి ఫంక్షన్‌ జరిగితే.. నువ్వు వెళ్లలేదంటే నమ్మేదెలా? ఆ ఫంక్షన్‌కు నీతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లారా? లేదా? నువ్వే సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లింది నిజమా? కాదా?’’ చెప్పాలంటూ సంజయ్‌.. కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేటీఆర్‌ తన ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకున్నది నిజమా కాదా? చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీ బామ్మర్ది ఫంక్షన్‌కు తెలంగాణవాదానికి ముడిపెడతావేంటి? దీని వెనక మతలబేంటి? మామూలు ఫంక్షన్‌ అయితే డీజీపీతో మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అని నిలదీశారు.


  • ఫాంహౌస్‌ సీసీ పుటేజీ బయటపెట్టాలి

జన్వాడ ఫాంహౌస్‌ సీసీ ఫుటేజీ బయటపెట్టాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. జన్వాడ ఫాంహౌ్‌సలో రేవ్‌ పార్టీనో లేక ‘రావు’ల పార్టీనో జరిగినట్లు తెలిసిందని, ఈ ఫాంహౌస్‌ సీసీ ఫుటేజీని పోలీసులు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ చుట్టూ వారాంతాలు వచ్చాయంటే రేవ్‌ పార్టీలని, రావు పార్టీలని.. విదేశీ మద్యంతో పాటు కొకైన్‌, డ్రగ్స్‌ తీసుకొచ్చి డ్రగ్స్‌ మాఫియాను పెంపొందిస్తున్నారని ఆరోపించారు. జన్వాడ ఫాంహౌ్‌సలో వీఐపీల పిల్లలు ఉన్నారని వార్తలు వస్తున్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి వారితో కుమ్మక్క కాకపోతే వెంటనే సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 28 , 2024 | 03:40 AM