Share News

Kishan Reddy: కొత్త శక్తిగా అవతరించనున్నాం

ABN , Publish Date - May 14 , 2024 | 05:19 AM

తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తమ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తగ్గిందని చెప్పారు.

Kishan Reddy: కొత్త శక్తిగా అవతరించనున్నాం

తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ సీట్లు సాధిస్తాం.. మిడిమిడి జ్ఞానంతో ప్రధానికి రేవంత్‌ సవాళ్లు

మోదీపై దుష్ప్రచారం చేస్తే పెద్ద నేతలు కాలేరు

హైదరాబాద్‌లో ఓటర్‌ లిస్ట్‌ అస్తవ్యస్తం: కిషన్‌రెడ్డి

ఓటమి భయంతో రేవంత్‌ కోడ్‌ ఉల్లంఘించారు

ఈసీ చర్యలు తీసుకోవాలి: సంజయ్‌

హైదరాబాద్‌/హుస్నాబాద్‌ రూరల్‌/సంగారెడ్డి అర్బన్‌, మే 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తమ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తగ్గిందని చెప్పారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కొంత తగ్గినా, మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుచూపారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. ఓటింగ్‌ శాతంతో సంబంధం లేకుండా సికిందరాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలోనే కొన్ని కోర్సులకు అడ్మిషన్లు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించగానే వర్సిటీ భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో ప్రధానిపై సవాళ్లు చేస్తున్నారని విమర్శించారు. స్థాయి మరచి ప్రధానిపై విమర్శలు చేయొద్దని హితవు పలికారు. బీజేపీపై, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన పెద్ద నాయకులు కాబోరని అన్నారు. ‘‘పీఎం అయ్యాక పెళ్లి చేసుకోవాలని రాహుల్‌ అనుకున్నారు. కానీ ప్రధాని అయ్యే అవకాశం లేదని ఆయనకు తెలిసిపోయింది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. మంచిదే కదా’’ అని అన్నారు. కాగా, మునిసిపల్‌ అధికారుల వైఖరి వల్ల హైదరాబాద్‌లో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా మారిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తమకు ఓ చోట, తమ కుమారుడికి మరో చోట ఓటు కేటాయించారని.. దీనిపై కేంద్ర మంత్రిగా లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఒక వర్గం వారి కోసం షేక్‌పేటలో ఏకంగా 3 వేల ఓట్లను తొలగించారని ధ్వజమెత్తారు. షేక్‌పేటలో ఓట్లు గల్లంతయిన పోలింగ్‌ కేంద్రాన్ని కిషన్‌రెడ్డి సందర్శించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు.


రేవంత్‌కు కోడ్‌ వర్తించదా..?: సంజయ్‌

రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రె్‌సకు ఓటమి తప్పదన్న టెన్షన్‌ ఆయన ముఖంలో కనిపించిందని, అందువల్లే కోడ్‌ ఉల్లంఘించి మాట్లాడారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాల, కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించిన సీఎం రేవంత్‌ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రె్‌సకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే.. ఆయనకు ఎన్నికల కోడ్‌ వర్తించదా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఓటర్లకు మద్యం, డబ్బు పంచుతూ ప్రలోభాలకు గురిచేసినా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మెజారిటీ సీట్లు తథ్యమని, కరీంనగర్‌లో బంపర్‌ మెజారిటీ ఖాయమని సంజయ్‌ తేల్చి చెప్పారు.

రేవంత్‌పై ఈసీకి ఫిర్యాదు: రఘునందన్‌రావు

కొడంగల్‌లో ఓటు వేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఉద్దేశపూర్వంగా ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డిలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డిపై తమ పార్టీ ప్రత్యక్షంగా, మెయిల్‌ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌తో గెలవబోతుందని, రేవంత్‌రెడ్డి ఓటమిని అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్థానాలకు ఇబ్బందవుతుందనే అనుమానంతో రైతుబంధు వేశామని, రేపు రుణమాఫీ చేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని రఘునందన్‌ అన్నారు.

Updated Date - May 14 , 2024 | 05:19 AM