BRS : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు..
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:29 AM
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది.
మాతాశిశు మరణాల వివరాలకు గాంధీ ఆస్పత్రికి
నిజనిర్ధారణ కమిటీగా వెళ్లిన మాగంటి, సంజయ్
లోపలికి రానివ్వని పోలీసులు.. రోడ్డుపై నిరసన
అదుపులోకి తీసుకొని గోషామహల్ తరలింపు
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే రాజయ్య అదుపులోకి
కాంగ్రెస్ అరాచకాలకు భయపడం: కేటీఆర్
ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ
అడ్డగుట్ట/హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకుగాను కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. కమిటీ సభ్యులైన వైద్యశాఖ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.. గాంధీ ఆస్పత్రి వద్దకు బయలుదేరగా, రాజయ్యను పోలీసులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. ఆస్పత్రి వద్దకు రాగా వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు ఆస్పత్రి ఎదురుగా రోడ్డుపై నిరసన చేపట్టారు. గాంధీ ఆస్పతిలో ఏం జరుగుతోందో, మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు తాము వచ్చామని అన్నారు. ఆస్పత్రిలో ఒకేసారి పెద్దసంఖ్యలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను బదిలీ చేశారని, సరైన వసతులు కూడా లేవని తెలిపారు. తాము ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి ఈ వివరాలు తెలుసుకుంటామని, తమను వెళ్లనివ్వాలంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు అనుమతించకపోవడంతో ఆస్పత్రి ఎదుట కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి, గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.
ఆస్పత్రులను సందర్శిస్తే భయమెందుకు?
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత అధికంగా ఉందని, కాంగ్రెస్ అసమర్థ పాలనవల్ల ప్రజారోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులు టి.రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు అరెస్టు చేసి.. విడుదల చేసిన అనంతరం వారు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాము ఆస్పత్రుల సందర్శనకు వెళితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. మాతాశిశు మరణాలు పెరిగిపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు సమీక్షించడం లేదని నిలదీశారు. గాంధీ ఆస్పత్రి వద్దకు వెళ్లిన తమను అరెస్టు చేసి బీఆర్‌ఎస్ కార్యాలయానికి తీసుకొచ్చి వదిలిపెట్టారని తెలిపారు.
మరణాల డేటా బయటికెలా వచ్చిందో తెలుసుకుంటున్నాం: డీఎంఈ
గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలకు సంబంధించిన వివరాలు బయటికి ఎలా వచ్చాయో చెప్పలేకపోతున్నామని డీఎంఈ డాక్టర్ వాణి అన్నారు. గైనిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిసిందన్నారు. అంతకుముందు వీళ్లు ఈ విభాగంలో లేరని తెలిపారు. ఏదేమైనా ఈ డేటా బయటికి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆస్పత్రి నుంచి డీఎంహెచ్‌వో విభాగానికి డేటా వెళ్లినట్లు తెలిసిందని, బయటికి వచ్చిన గర్భిణుల పేర్లు మక్కీమక్కీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ఎంసీహెచ్ భవనంలో ఐవీఎఫ్ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని డీఎంఈ తెలిపారు. కొత్త యంత్రాలతో నూతనంగా ప్రారంభోత్సవాలు లేకుండానే ఇంతకుముందున్నట్లు ఐపీఎఫ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా.. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాల వివరాలు బయటికి ఎలా వచ్చాయన్న దానిపై ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు డాటా ఎంట్రీ ఉద్యోగులపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజం బయటికొస్తుందనే..: కేటీఆర్
ప్రభుత్వాస్పత్రుల్లోని పరిస్థితులు తెలుసుకునేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? అని, అసమర్థత బయట పడుతుందన్న భయమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏమీ దాచడంలేదంటే బీఆర్‌ఎస్ అధ్యయన కమిటీని దర్యాప్తు చేయనివ్వాలని అన్నారు. కమిటీ నివేదిక ద్వారా ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి సూచనలు అందుతాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మాత్రం అవేవీ జరగొద్దన్న ఈగోతో వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 400కు పైగా బస్తీ దవాఖానాలు స్థాపించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నవాటిని కూడా సరిగ్గా నడపడం చేతకావడం లేదని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. నగరవాసులు విషజ్వరాలతో నరకయాతన పడుతుంటే ఆదుకోవాల్సిన బస్తీ దవాఖానాలకే సుస్తీ చేసిందన్నారు. తక్షణమే వాటి నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడి విధ్వంసం చేసేందుకు ప్రయత్నించాయని కేటీఆర్ తెలిపారు. ఇలాంటి అరాచకాలకు బీఆర్‌ఎస్ శ్రేణులు భయపడబోవని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధి నుంచి కార్యకర్త వరకు 60 లక్షల మంది సభ్యులున్న బీఆర్‌ఎస్.. పెద్ద కుటుంబమని, ఎవరికి ఇబ్బంది కలిగినా సమిష్టిగా అండగా ఉంటుందని తెలిపారు. దాడికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.