రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:07 AM
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ.. రాజ్యాంగ స్ఫూర్తిని ఖూనీ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
పార్టీ మారిన వ్యక్తిని పీఏసీ చైర్మన్‌ను చేయడమేంటి?.. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా నియామకం
ప్రతిపక్ష ఎమ్మెల్యేను విస్మరించడం దారుణం: హరీశ్
దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ తీరు: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుచిత నిర్ణయాలు తీసుకుంటూ.. రాజ్యాంగ స్ఫూర్తిని ఖూనీ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా.. శాసనసభ సంప్రదాయాలను సైతం మంటగలుపుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు దక్కాల్సిన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన ఎమ్మెల్యేను విస్మరించి.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌ను చేయడం దారుణమన్నారు.
నిత్యం రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్‌గాంధీ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1958-59 నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు. శాసనసభ్యులకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లోని 65వ పేజీలో పీఏసీ చైర్మన్ ఎన్నికపై స్పష్టంగా వివరించారని తెలిపారు. అలాంటిది.. పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీని ఏ నిబంధన ప్రకారం పీఏసీ చైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్ నియమించారని ప్రశ్నించారు. ‘‘శాసనసభ నిర్దేశించిన బిజినెస్ రూల్ 250 ప్రకారం 9మంది ఎమ్మెల్యేలను పీఏసీ సభ్యులుగా ఎన్నుకోవాలి. పీఏసీ కమిటీ ఏర్పాటు చేసేనాటికి బీఆర్‌ఎ్‌సకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిప్రకారం ముగ్గురు సభ్యులు బీఆర్‌ఎస్ నుంచి పీఏసీలో ఉండాలి. కానీ, ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి సుమారు 13 మంది అవసరం అవుతారన్న నిబంధనను ఎక్కడా పాటించలేదు. పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీని బీఆర్‌ఎ్‌సకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎలా ఎన్నుకున్నారో స్పీకర్ చెప్పాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఎవరూ ప్రతిపాదించని వ్యక్తికి ఎలా ఇచ్చారు?
ప్రతిపక్ష పార్టీ నుంచి పీఏసీ చైర్మన్, సభ్యుల ఎన్నిక చేపట్టాలన్న నిబంధనను అనుసరించి.. తమ పార్టీ పీఏసీ చైర్మన్‌గా తన పేరును, సభ్యులుగా వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లను ప్రతిపాదించారని హరీశ్‌రావు తెలిపారు. అయితే ఈ కమిటీలో సభ్యులుగా ప్రతిపాదించిన ఇద్దరిని ఆమోదించి.. ఎవరూ ప్రతిపాదించని అరికెపూడి గాంధీని నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్‌గా నియమించడమేంటని ప్రశ్నించారు. స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పాల్పడని దుశ్చర్యకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని హరీశ్‌రావు మండిపడ్డారు. లోక్‌సభలో 99 మంది సభ్యులతో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీ వేణుగోపాల్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించారని గుర్తుచేశారు. కాగా, పీఏసీ చైర్మన్ పదవి విషయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.