Delhi: తెలంగాణకు కేంద్రం సహకరించట్లేదు..
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:50 AM
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వేల కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ ఆ నిధులు ఇవ్వట్లేదన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
వేలకోట్లు రావాల్సి ఉన్నప్పటికీ ఇవ్వట్లేదు
రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు
బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేశ్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వేల కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ ఆ నిధులు ఇవ్వట్లేదన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని సురేశ్‌రెడ్డి అన్నారు. గత ప్రసంగంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని, అది నేటికీ అమలు కాలేదని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయేతోపాటు ఇండియా కూటమికి కూడా బలమిచ్చేలా ఓట్లు వేశారని.. అధికార, ప్రతిపక్షాలు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా నిలిపారన్నారు.
ప్రపంచానికి భారతదేశం విశ్వబంధుగా నిలిచిందని రాష్ట్రపతి చెప్పారని, అలాగే భారత్‌కు తెలంగాణ దేశబంధుగా నిలిచిందని తెలిపారు. లోక్‌సభలో అనేకమంది రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని ప్రమాణాలు చేశారని, వాటిని పాటించాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తామని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినిపిస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని, ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థను ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి, నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని కోరారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.