Share News

BRS: ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు..

ABN , Publish Date - Sep 10 , 2024 | 02:52 AM

పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ పేర్కొంది.

BRS: ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు..

  • కాంగ్రెస్‌ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు

  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం

  • ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం..

  • బీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యం: కేటీఆర్‌, హరీశ్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు లాంటిదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై.. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని, అక్కడి ప్రజలు బీఆర్‌ఎ్‌సనే గెలిపిస్తారని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ స్పీకర్‌ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాక్షేత్రంలోనూ గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు.


‘‘పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియ్‌సగా ఉంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీ లోకి వెళ్లడం నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయటమే. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫించన్‌ రాకుండా చట్టం చేశారు. కర్ణాటకలో తమ పార్టీ ఎమ్మెల్యేలను రూ.100 కోట్లు ఇచ్చి బీజేపీ ఎత్తుకెళుతోందని మొత్తుకున్నారు. తెలంగాణలో ఒక నీతి, ఇతర రాష్ర్టాల్లో మరో నీతా?’’ అని కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రశ్నించారు. కాగా, రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు రావడం హర్షణీయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించడంలో ఇక జాప్యం చేసేందుకు అవకాశం లేదని మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్‌ ఎవరి మాటలూ వినకుండా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ కోరారు.

Updated Date - Sep 10 , 2024 | 02:52 AM