Share News

Nalgonda: పట్టుబడిన పార్దీ గ్యాంగ్‌..

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:12 AM

జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాల్లోని వాహనదారులపై రాళ్లతో దాడి చేసి చోరీలకు పాల్పడుతూ, ప్రతిఘటించిన వారి ప్రాణాలు తీస్తున్న పార్దీ గ్యాంగ్‌ అనే దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

Nalgonda: పట్టుబడిన పార్దీ గ్యాంగ్‌..

  • హైవేల్లో వాహనదారులపై దాడి చేసి చోరీలు, హత్యలు..

  • ఇళ్లలోకి చొరబడి దోపిడీలు చేసే ముఠా

  • హైదరాబాద్‌ శివారులో ఇద్దరి అరెస్టు, మరో ఇద్దరు పరారీ

నల్లగొండ, జూలై 6: జాతీయ రహదారులపై ఆగి ఉన్న వాహనాల్లోని వాహనదారులపై రాళ్లతో దాడి చేసి చోరీలకు పాల్పడుతూ, ప్రతిఘటించిన వారి ప్రాణాలు తీస్తున్న పార్దీ గ్యాంగ్‌ అనే దొంగల ముఠాకు చెందిన ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారులో చిక్కిన ఈ దొంగలు తప్పించుకునేందుకు ఎదురుదాడి దిగగా.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు. హత్య, చోరీలు వంటి 32 కేసుల్లో వీరు నిందితులుగా ఉండగా.. కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ శనివారం విలేకరులకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అప్ప పాండ్రంగ, శుభం అశోక్‌, కాశ్మీర్‌ శశిపాల్‌ భోంస్లే, అధేష్‌ అనిల్‌ ఖలే ముఠాగా ఏర్పడి పార్దీ గ్యాంగ్‌ పేరుతో చోరీలు చేసేవారు.


చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూరు మండలాలు, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి, సంగారెడ్డి ప్రాంతాల్లో జాతీయ రహదారుల పక్కన వాహనాలు ఆపి నిద్రిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారు. నిద్రిస్తున్న వాహనదారులను రాళ్లు, స్ర్కూడ్రైవర్లతో కొట్టి భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దొంగలించి పరారయ్యేవారు. అలాగే, ఆరుబయట, ఇళ్లలో నిద్రిస్తున్న వారి మెడలోని బంగారు వస్తువులు చోరీ చేసేవారు. ఈ క్రమంలో తమకు ఎవరైనా ఎదురుతిరిగితే విచక్షణారహితంగా కొట్టి చంపేవారు. అలాగే, ఇళ్ల ముందు, పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను దొంగలించి చోరీలకు వాడి పనయ్యాక శివారు ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. ఇంత క్రూరమైన ఈ ముఠా గత నెల 18న ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురానికి చెందిన కొల్లూరి రాజవర్ధన్‌ (32)ను కట్టంగూరు పీఎస్‌ పరిధిలో హైవేపై హత్య చేసింది.


రాజవర్ధన్‌ తన మినీ గూడ్స్‌ వ్యాన్‌ను రహదారి పక్కన ఆపి నిద్రిస్తుండగా దాడి చేసిన పార్దీ గ్యాంగ్‌... రాజవర్ధన్‌ను కట్టేసి స్ర్కూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసి అతని వద్ద ఉన్న రూ.14,500 తీసుకుని పరారైంది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల జాడ గుర్తించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌లో ఓ చోరీ చేసిన ఈ ముఠా ఓ ఆటోలో హైదరాబాద్‌ వైపు వెళుతుండగా గుర్తించిన పోలీసులు వారిని వెంబడించి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ వద్ద అడ్డుకున్నారు. తప్పించుకునేందుకు యత్నించిన దొంగలు తమ వద్ద ఉన్న కత్తెరలు, స్ర్కూడ్రైవర్లతో దాడి చేయగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ముఠాకు చెందిన అప్ప పాండ్రంగ, శుభం అశోక్‌ను అరెస్టు చేశారు.


మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. దొంగలు చేసిన దాడిలో విక్రమ్‌ శంకర్‌ అనే కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. నిందితుల వద్ద నుంచి రూ.17వేల నగదు, స్ర్కూడ్రైవర్‌, రెండు కత్తెరలు, జత వెండి పట్టీలు, టార్చ్‌లైట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో నమోదైన 32 కేసుల్లో తమ నేరాలను నిందితులు పోలీసు విచారణలో అంగీకరించారు. కాగా, ప్రస్తుతం రిమాండ్‌కు తరలించిన నిందితులను మళ్లీ కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలను రాబడతామని ఎస్పీ పేర్కొన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 03:12 AM