Share News

క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

ABN , Publish Date - May 28 , 2024 | 05:39 AM

ప్రముఖ బిల్డర్‌, కుత్బుల్లాపూర్‌ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్‌ కుప్పాల మధు (49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌ నుంచి మధు, తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీదర్‌కు వెళ్లాడు.

క్యాసినో కింగ్‌ మధు దారుణహత్య!

  • ముగ్గురు స్నేహితులతో కలిసి బీదర్‌కు.. అక్కడ బీరుబాటిళ్లతో పొడిచి చంపిన స్నేహితులు!

  • ఒంటిపై ఉన్న రూ.20లక్షల నగలు, రూ.కోటి నగదుతో పరార్‌!

జీడిమెట్ల, మే 27(ఆంధ్రజ్యోతి): ప్రముఖ బిల్డర్‌, కుత్బుల్లాపూర్‌ వాస్తవ్యుడు, జనసేన పార్టీ నేత, క్యాసినోకింగ్‌ కుప్పాల మధు (49) కర్ణాటకలోని బీదర్‌లో దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌ నుంచి మధు, తన ముగ్గురు స్నేహితులతో కలిసి బీదర్‌కు వెళ్లాడు. అక్కడ డబ్బు విషయంలో తలెత్తిన వివాదంతో ఆ స్నేహితులే బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా కడుపులో పొడిచి హత్యచేసి పారిపోయినట్లు బంధువులు ఆరోపిస్తన్నారు. హతుడి నుంచి రూ.20 లక్షల విలువ చేసే బంగారం, రూ.కోటి నగదును తీసుకుని వారు ఉడాయించినట్లు తెలుస్తుంది. మధు స్వస్థలం ఏపీ కోనసీమ జిల్లాలోని అమలాపురం. 30 ఏళ్లక క్రితం హైదరాబాద్‌కొచ్చి కుత్బుల్లాపూర్‌ చింతల్‌ గణేశ్‌నగర్‌లో మణికంఠ ట్రావెల్స్‌ పేరుతో కార్లు అద్దెకిచ్చేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కొన్నాళ్ల క్రితం బిల్డర్‌గా మారాడు.


మధుది మొదటి నుంచీ క్యాసినోలో అందెవేసిన చేయి అని, క్యాసినోకి వెళితే ఇంటికి రూ.లక్షల డబ్బును తీసుకురావడమే తప్ప పోవడం అంటూ ఉండదని అతడి స్నేహితులు చెబుతుంటారు. క్యాసినో ద్వారా పేరొందిన చీకోటి ప్రవీణ్‌తోనూ మధు సత్సంబందాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాసినో ఏజెంట్‌గా మారిన మధు.. గోవా, మలేసియా, బెంగళూర్‌, కర్ణాటక, సింగపూర్‌, దుబాయ్‌కి వెళ్లి క్యాసినోలో పాల్గొనేవాడని తెలుస్తుంది. జనసేన పార్టీ ముఖ్యనాయకుడిగా ఉన్న మధు ఇటీవల ఏపీలోని పిఠాపురంలో పవన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించాడు. తన రెండో కుమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో ఆగస్టులో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 23న ఊరు నుంచి వచ్చిన మధు, ఆ మరుసటి రోజు ఉదయం కల్పన సొసైటీకి చెందిన తన స్నేహితులు రేణుకా ప్రసాద్‌, నిఖిత్‌, గోపీ రావడంతో కారులో బయటకు వెళ్లాడు. కాసేపటికి భార్యకు ఫోన్‌చేసి తాను పనిమీద స్నేహితులతో కలిసి బీదర్‌ పోతున్నానని చెప్పాడు. అదేరోజు రాత్రి ఇంట్లో వారికి ఫోన్‌చేసి తిరిగి ఇంటికొస్తున్నానని చెప్పాడు.


ఆ రోజు రాత్రి రూ.60 లక్షల నుంచి దాదాపు రూ.కోటి దాకా మధు క్యాసినోలో గెలిచినట్లు తెలుస్తోంది.. తిరుగు ప్రయాణంలో రాత్రి 11గంటలకు ఆయన ముగ్గురు స్నేహితులు, మధుతో బలవంతంగా బీరు తాగించి, డబ్బుల విషయంలో గొడవపడ్డట్లు తెలుస్తోంది. తర్వాత మధును బీదర్‌ మన్నాకెళ్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధి తల్కడి ప్రాంతం జాతీయ రహదారి పక్కన మూసివేసిన ఓ దాబా వద్దకు తీసుకెళ్లి.. బీరు బాటిళ్లతో 30సార్లు పొడిచి హత్యచేశారు. అనంతరం ఆయన ఒంటిపై ఉన్న రూ.20లక్షల విలువ చేసే బంగారు నగలు, క్యాసినోలో గెలిచిన డబ్బును తీసుకొని పారిపోయినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం ఓ పశువుల కాపరి అటువైపు వెళ్తూ మధు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారు నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి మధు కుటుంబ సభ్యులకు విషయం తెలియజే శారు. వెంటనే బీదర్‌ చేరుకున్న కుటుంబసభ్యులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి 12.30గంటలకు కుత్బుల్లాపూర్‌ తీసుకొచ్చారు. ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. మధుతోపాటు వెళ్లిన స్నేహితులు పత్తా లేకుండా పోవడంతో వారే ఈ హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు డబ్బు వివాదమే కారణమా? లేదంటే వివాహేతర సంబంధం, పాతకక్షలు కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.

Updated Date - May 28 , 2024 | 05:39 AM