Kishan Reddy: జమిలిపై త్వరలో కమిటీ
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:28 AM
జమిలి ఎన్నికల నిర్ణయం అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు.
47కు 32 పార్టీలు మద్దతు తెలిపాయి
మిగతా పార్టీలూ త్వరలో ముందుకొస్తాయి
జమిలితో ఆర్థిక భారం తగ్గుతుంది..
ఇతర సమస్యలూ పరిష్కారమవుతాయి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికల నిర్ణయం అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. జమిలి విధానాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా కమిటీకి సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల.. ఓటర్లలో నిరాసక్తత పెరిగి ఓటింగ్ శాతం తగ్గడం స్పష్టంగా కనబడుతోందన్నారు. దీనికి జమిలి ఎన్నికలు పరిష్కారం చూపుతాయని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం వల్ల సుమారు రూ.4,500 కోట్లు ఖర్చు అవుతోందని, జమిలితో ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, దీనికి వేర్వేరుగా ఎన్నికలు జరగడం ప్రధాన అడ్డంకిగా ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. దేశవ్యాప్తంగా తరుచూ ఏదో ఒకచోట ఎన్నికలు, ‘కోడ్’ అమలు వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆటంకం కలుగుతోందన్నారు. కొన్నిసార్లు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి తలెత్తుతోందన్నారు.
జమిలి అమలులోకి వచ్చాక ఆరు నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయితే మిగిలిన నాలుగున్నరేళ్లు దేశాభివృద్ధిపై దృష్టి సారించవచ్చన్నారు. 47 రాజకీయ పార్టీల్లో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలంగా స్పందించాయన్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ నివేదిక ఆధారంగానే జమిలి ఎన్నికలకు ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉండడం వల్ల ఓటర్ల హక్కులు కూడా కాపాడినట్లవుతుందన్నారు.