Share News

Water Resources: ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారు?

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:28 AM

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ కింద ఉన్న ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రశ్నించింది.

Water Resources: ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారు?

  • కాళేశ్వరంతో పాటు సమ్మక్క సాగర్‌ లోనూ చూపిన గత ప్రభుత్వం

  • అభ్యంతరం తెలిపిన సీడబ్ల్యూసీ

  • సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశం

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండో దశ కింద ఉన్న ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రశ్నించింది. సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం బ్యారేజీ) ప్రాజెక్టులో ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని గత ప్రభుత్వం డీపీఆర్‌లో పొందుపరిచింది. వాస్తవానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో కూడా ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ కింద 4.40 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు చూపించారు. అయితే 2006-07లో సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ ప్రాజెక్టును నాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికింద 2006-07 నుంచి కేంద్రం నిధులు విడుదల చేస్తూనే ఉంది.


ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టు ఆయకట్టును కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనూ, సమ్మక్కసాగర్‌లోనూ చూపించడాన్ని సీడబ్ల్యూసీ తప్పుపట్టింది. ఇటీవల సీడబ్ల్యూసీలో జరిగిన అంతరాష్ట్ర వ్యవహారాల సమావేశంలో సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు క్లియరెన్స్‌ అంశం చర్చకు రాగా.. ఈ ప్రాజెక్టులో చూపించిన ఆయకట్టుపై ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌ఎస్పీ-2 ఆయకట్టును ఎన్ని ప్రాజెక్టుల్లో చూపిస్తారని? దీనిపై సమగ్ర నివేదికను అందించాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. రూ.9257 కోట్లతో చేపట్టిన సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు పనులు 95 శాతం మేర పూర్తయ్యాయి.


ఒక్క రూపాయి వెచ్చిస్తే.. రూ.1.67ల రాబడి వస్తుందని డీపీఆర్‌లో పొందుపరిచారు. లబ్ధిని ఎక్కువగా చూపే క్రమంలోనే గత ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎస్పీ రెండో దశ స్థిరీకరణను ఈ ప్రాజెక్టు ఖాతాలో వేసింది. ఈ బ్యారేజీలో నీటిని నిల్వ చేసి.. బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోయడం ద్వారా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఛత్తీ్‌సగఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తెచ్చుకొని సమర్పిస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అవకాశాల్లేవని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చిచెప్పింది.


గరిష్ఠ వరద పరిహారానికి ఛత్తీ్‌సగఢ్‌ పట్టు

గోదావరిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ పూర్తిస్థాయి నీటినిల్వ 83 మీటర్లు కాగా.. అక్కడిదాకా ముంపునకు గురయ్యే భూములకే పరిహారం చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే గరిష్ఠ వరద 2022 జూలై 17, 19వ తేదీల్లో 88 మీటర్ల దాకా రికార్డయిందని.. ఆ మేరకు ముంపునకు గురయ్యే భూములకు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని ఛత్తీ్‌సగఢ్‌ పట్టుబడుతోంది. గరిష్ఠ వరదతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో భూసేకరణ చేయాల్సిందేనని తేల్చడంతో ఎన్‌వోసీ జారీ సంక్లిష్టంగా మారింది. రేవంత్‌ సర్కారు ఈ ప్రాజెక్టుకు అనుమతి తెచ్చే బాధ్యతను నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌దా్‌సకు అప్పగించింది. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.

Updated Date - Jul 14 , 2024 | 04:28 AM