Share News

Land Acquisition: భూములు ఇచ్చేదేలే!

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:15 AM

రాష్ట్రంలో పలు జాతీయ రహదారులకు భూసేకరణ సమస్యగా మారింది. రోడ్లు నిర్మాణమయ్యే పలు ప్రాంతాల్లోని రైతులు భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల అలైన్‌మెంట్‌ మార్చాలంటూ పనులను అడ్డుకుంటున్నారు.

Land Acquisition: భూములు ఇచ్చేదేలే!

  • జాతీయ రహదారులకు భూమి సమస్య

  • 1,442 కి.మీ. రహదారుల నిర్మాణానికి..

  • 8,199 హెక్టార్ల భూమి అవసరం

  • ఎన్‌హెచ్‌ఏఐకి అందింది 3859 హెక్టార్లే

  • 4,340 హెక్టార్ల సేకరణ పెండింగ్‌

  • 7 జిల్లాల్లోని రహదారుల పనుల్లో జాప్యం

  • వేగిరానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలు జాతీయ రహదారులకు భూసేకరణ సమస్యగా మారింది. రోడ్లు నిర్మాణమయ్యే పలు ప్రాంతాల్లోని రైతులు భూములను ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల అలైన్‌మెంట్‌ మార్చాలంటూ పనులను అడ్డుకుంటున్నారు. దీంతో రహదారి నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్న భూ సేకరణ జరగడం లేదు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు సమయానికి భూమి అందడంలేదు. దీంతో రహదారుల నిర్మాణ పనులు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారులు మంజూరైన 7 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వరంగల్‌ (ఎన్‌హెచ్‌ 163, 563); ఖమ్మం (ఎన్‌హెచ్‌ 365ఏ), (ఎన్‌హెచ్‌ 365 బీజీ, 365 బీబీ), మహబూబ్‌నగర్‌ (ఎన్‌హెచ్‌ 150 సీసీ, 44), హైదరాబాద్‌ (ఎన్‌హెచ్‌ 44, 65, 163), కామారెడ్డి (ఎన్‌హెచ్‌ 44), మంచిర్యాల (ఎన్‌హెచ్‌ 363), సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ (ఎన్‌హెచ్‌ 161) కలిపి రాష్ట్రానికి దాదాపు 1,442 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.


ఈ రోడ్ల నిర్మాణాలకు మొత్తం 8,199 హెక్టార్ల భూమి అవసరమని ఎన్‌హెచ్‌ఏఐ తేల్చింది. ఆయా జిల్లాల్లో తీసుకోవాల్సిన భూమి, రైతుల వివరాలను కూడా సేకరించింది. కానీ, ఇప్పటివరకు సగం భూమిని మాత్రమే ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారు. కొన్నిచోట్ల రైతులు భూములివ్వబోమని చెప్పడం, మరికొన్ని చోట్ల అలైన్‌మెంట్‌ మార్చాలని పట్టుబడుతుండడంతో రహదారుల నిర్మాణ పనులు జాప్యం అవుతున్నాయి. రహదారుల నిర్మాణ పనులకు అవసరమైన మొత్తం 8,199 హెక్టార్లలో ఇప్పటివరకు 5,694 హెక్టార్ల భూమినే సేకరించారు. ఇందులోనూ ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూమికి ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమిని తీసుకునేటప్పుడు భారత రాష్ట్రపతి పేరు మీద మ్యుటేషన్‌ చేస్తారు)కు 3,859 హెక్టార్లు మాత్రమే మ్యుటేషన్‌ అయింది.


అంటే సేకరించిన భూమిలోనే ఇంకా 1,835 హెక్టార్లు ఎన్‌హెచ్‌ఏఐకు అందాల్సి ఉంది. మొత్తం 4,340 హెక్టార్ల భూమి ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోకి తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణకు సహకారం అందించాలని, సేకరణను వేగిరం చేసేలా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదేవిధంగా భూ సేకరణ సమయంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు పోలీస్‌ రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది.

Updated Date - Jul 16 , 2024 | 04:15 AM