Share News

Maoist Encounter: బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత జగన్‌ మృతి

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:00 AM

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Maoist Encounter:  బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టు అగ్రనేత జగన్‌ మృతి

  • చర్చి పాస్టర్‌ నుంచి మావోయిజం వైపు..

  • ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి..

  • 35 ఏళ్లు కొనసాగిన జగన్‌ ప్రస్థానం

  • ఆయనపై రూ.25 లక్షల రివార్డు

  • ఎన్‌కౌంటర్‌ మృతుల్లో మిగిలినవారి గుర్తింపు

వరంగల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి), చర్ల, సెప్టెంబరు 4: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా.. బుధవారం ఉదయం మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసోబు అలియాస్‌ జగన్‌ అలియాస్‌ రణ్‌దేవ్‌ దాదా మృతదేహాన్ని గుర్తించారు. జగన్‌ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం. ఆయన అసలు పేరు మాచర్ల ఏసోబు. దళిత సామాజికవర్గానికి చెందిన ఏసోబు.. తొలుత చర్చి పాస్టర్‌గా పనిచేశారు.


రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. భూస్వామ్య వ్యతిరేక పోరాటాల పట్ల ఆకర్షితుడై.. 1990లో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌(పీడబ్ల్యూజీ) నేత కడారి రాములు అలియాస్‌ రవి నేతృత్వంలో అడవుల బాట పట్టా రు. అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత వరంగల్‌ జిల్లా అన్నాసాగర్‌ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 35 ఏళ్లు అనేక ఉద్యమాల్లో, దాడుల్లో పాల్గొన్నారు. క్రమంగా ఆర్గనైజర్‌గా, కమాండర్‌గా నియమితులయ్యారు. 1995లో వరంగల్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా.. 2001లో తెలంగాణ కమిటీ ప్రెస్‌, రక్షణ వ్యవహారాల కోసం ఏర్పాటైన ప్లటూన్‌ కమాండర్‌గా పనిచేశారు. 2004లో కేంద్ర కమిటీ రక్షణ కోసం ఏర్పాటైన కంపెనీ కమాండర్‌గా.. 2012లో ఛత్తీ్‌సగఢ్‌లో జనతన సర్కార్‌లో వ్యవసాయాభివృద్ధి కమిటీ నేతగా అబూజ్‌మఢ్‌లో పనిచేశారు.


ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా.. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ఇన్‌చార్జిగా, కేంద్ర కమిటీ మిలటరీ ఇన్‌చార్జిగా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మంగళవారం ఎన్‌కౌంటర్‌లో జగన్‌ మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. జగన్‌ అజ్ఞాతంలోకి వెళ్లాక.. ఎన్నడూ సొంత ఊరికి రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా.. జగన్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గురువారం మధ్యాహ్నానికి ఆయన మృతదేహం టేకులగూడెం చేరుకుంటుందని, ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో మాజీ నక్సలైట్లు, హక్కుల కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మిగతా 8 మంది మావోయిస్టులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో శాంతికుమారి(రూ.5లక్షల రివార్డు), మడకం సుశీల (5లక్షలు), ముచకి గంగి(5లక్షలు), కోసా మాద్వి(5లక్షలు), లలిత (5లక్షలు), కవిత (5లక్షలు), మకం హిడ్మే(2లక్షలు), కమలేశ్‌(2లక్షలు) ఉన్నారు. జగన్‌ సహా.. 9మందిపై రూ.59లక్షల రివార్డు ఉన్నట్లు వివరించారు.

Updated Date - Sep 05 , 2024 | 05:00 AM