Kandi: దేశాభివృద్ధిలో ఐఐటీ లు కీలకం
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:17 AM
అత్యున్నత సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ద్వారా దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం
కంది, జూలై 20: అత్యున్నత సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ద్వారా దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. మేటి విద్యాసంస్థల్లో చదివిన వారు తమ నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగిస్తే దేశం ఆర్థికంగా మరింత పురోగమిస్తుందని పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ 13వ స్నాతకోత్సవ వేడుకలకు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటీ-హెచ్లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ, వివిధ విభాగాల్లో డిగ్రీలు పూర్తి చేసుకున్న 1,103 మంది విద్యార్థులకు ఐఐటీ-హెచ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఐఐటీ-హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తిలతో కలిసి డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ..దేశంలోని వందకు పైగా యూనికార్న్ కంపెనీల్లో అధిక శాతం ఐఐటీ పూర్వ విద్యార్థులవేనని తెలిపారు. 5జీ, 6జీ టెక్నాలజీతోపాటు పలు రంగాల పరిశోధనల్లో ఐఐటీ-హెచ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఐఐటీ హైదరాబాద్ అతి తక్కువ కాలంలో దేశ సాంకేతిక విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు యువశాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య భూమి అయితే, విద్యా సంస్థలు బీజాలని.. వీటి సహకారంతోనే వికసిత భారత్ సాధ్యమవుతుందని తెలిపారు. ఇన్నోవేషన్, ఎక్సలెన్స్‌కు నిలువెత్తు నిదర్శనమని బీవీఆర్ మోహన్‌రెడ్డి కొనియాడారు. ఐఐటీ-హెచ్ గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని బీఎస్ మూర్తి పేర్కొన్నారు.