Alwal: కడుపునొప్పి భరించలేకే రూపాదేవి ఆత్మహత్య!
ABN , Publish Date - Jun 22 , 2024 | 05:05 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి బలవన్మరణం వెనుక గల కారణాలు బయటకు రాలేదు. అయితే ఆమెకు గైనిక్ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు తల్లి భూలక్ష్మమ్మ వాంగ్మూలిమిచ్చారు.
ఆమెకు గైనిక్ సమస్యలు.. తల్లి భూలక్ష్మమ్మ వాంగ్మూలం
కుటుంబంతో తిరుమల వెళ్లొచ్చాక చొప్పదండికి వెళ్లిన ఎమ్మెల్యే సత్యం
వెళ్లొద్దని, ఇంట్లోనే ఉండాలన్న రూపాదేవి
ఆ రోజు రాత్రి భర్తకు ఫోన్, వెంటనే రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక?
ఆ వెంటనే బెడ్‌రూంలోకి వెళ్లి చున్నీతో ఉరి
ముగిసిన అంత్యక్రియలు, బోరుమన్న సత్యం
అల్వాల్/మచ్చబొల్లారం జూన్ 21 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి బలవన్మరణం వెనుక గల కారణాలు బయటకు రాలేదు. అయితే ఆమెకు గైనిక్ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు తల్లి భూలక్ష్మమ్మ వాంగ్మూలిమిచ్చారు. రూపాదేవి సున్నిత మనస్కురాలనీ చెబుతున్నారు. రూపాదేవి అల్వాల్‌లోని తమ నివాసంలోని పడక గదిలో గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్యంతో రూపాదేవిది ప్రేమ వివాహం. ఆమె న్యాయవాద విద్య, బీఈడీ చదివారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కొలువు సాధించారు.
ఓయూలో న్యాయవాద విద్య చదువుతున్న రోజుల్లోనే అక్కడ ఆమెకు మేడిపల్లి సత్యం పరిచయమయ్యారు. 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు యోజిత్ (11), కుమార్తె రుషికశ్రీ (8) ఉన్నారు. తొలుత ఆమెకు మునీరాబాద్‌లో పోస్టింగ్ వచ్చింది. తర్వాత మేడ్చల్‌లోని రావల్‌కోల్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు మారారు. నెల క్రితం ఈ కుటుంబం అల్వాల్‌లోని పంచశీలకాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి షిప్ట్ అయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భర్త మేడిపల్లి సత్యం చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో రూపాదేవి, తోటి ఉపాధ్యాయులకు మిఠాయిలు పంచారు. ఇటీవల సత్యం.. భార్య రూపాదేవి, పిల్లలతో కలిసి తిరుమలకు వెళ్లొచ్చారు.
ఆ రోజు ఏం జరిగింది?
వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లడంతో సత్యం మూడు రోజులు చొప్పదండి నియోజకవర్గం బయటే ఉండిపోవాల్సి వచ్చింది. గురువారం నియోజకవర్గానికి వెళ్లి ప్రజలను కలవాల్సి ఉందంటూ భార్యకు చెప్పి ఆయన బయలుదేరారు. అయితే వెళ్లొద్దని, ఇంట్లోనే ఉండాలంటూ భర్తకు రూపాదేవి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి 10:30కు భర్తతో రూపాదేవి ఫోన్లో మాట్లాడారు. వెంటనే రావాలని, లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. కంగారుపడిన సత్యం, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పొడొద్దని, తాను అప్పటికే బయలుదేరినట్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత రూపాదేవి తన పడకగదిలోకి వెళ్లిపోయి, గడియ పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆమె తల్లి భూలక్ష్మమ్మ, కుమారుడు యోజిత్, కుమార్తె రుషికలతో పాటు సత్యం తరఫు బంధువు ఇంట్లోనే ఉన్నారు.
కొద్దిసేపటికి పడక గది తలుపులు తెరిచేందుకు చిన్నారులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. కూతురు రుషికశ్రీ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఆపార్ట్‌మెంట్‌లోనే ఉన్న కొందరు వ్యక్తులొచ్చి తలుపులను బద్దలు కొట్టారు. అప్పటికే రూపాదేవి సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశాక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తిరుమలగిరిలోని స్వర్గవాటికలో రూపాదేవి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో ఎమ్మెల్యే సత్యం భావోద్వేగానికి గురయ్యారు. కుమార్తె, కొడుకులను దగ్గరకు తీసుకొని భోరున విలపించారు.