Share News

CM Revanth Reddy: సురేశ్‌.. భేష్‌!

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:36 AM

వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌కు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

CM Revanth Reddy: సురేశ్‌.. భేష్‌!

  • కానిస్టేబుల్‌కు సీఎం అభినందనలు

రాజేంద్రనగర్‌, జూన్‌17 (ఆంధ్రజ్యోతి): వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌కు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. సురేశ్‌ సాయంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న యువతి యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలని ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆదివారం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు బస్‌స్టాప్‌ వద్ద ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సురేశ్‌కు పల్లెచెరువు సమీపంలోని మహవీర్‌ కాలే జ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ యువతి అప్పటికే ఆలస్యమై కంగారు పడుతూ కనిపించింది.


విషయం తెలుసుకున్న సురేశ్‌ వెంటనే ఆమెను తన బైకుపై పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి తీసుకెళ్లాడు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన సీఎం.. సురేశ్‌ను అభినందించారు. కాగా, కానిస్టేబుల్‌ సురేశ్‌కు మంచి పేరుంది. అంకితభావంతో విధి నిర్వహణ చేస్తూ గతంలో హోంమంత్రి, పోలీసు కమినర్ల నుంచి మొమోంటో, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 04:36 AM