Share News

CM Revanth : అనుమతి ఆపడానికే!

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:19 AM

‘‘మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉంది. 17ఏ కింద గవర్నర్‌ అనుమతి కోరాం. ఈ నిబంధన కింద గవర్నర్‌ అనుమతి ఇచ్చి తీరాలి. కానీ, 15 రోజులుగా గవర్నర్‌ వద్దే పెండింగ్‌లో ఉంది.

CM Revanth : అనుమతి ఆపడానికే!

  • రెండు రోజులుగా ఢిల్లీలో కేటీఆర్‌ ప్రయత్నాలు

  • ఆయనను విచారించేందుకు ఏసీబీ సిద్ధం

  • 15 రోజులుగా గవర్నర్‌ వద్ద ఫైలు పెండింగ్‌

  • 17ఏ కింద అనుమతి ఇచ్చి తీరాల్సిందే

  • కేటీఆర్‌ ఢిల్లీకి.. ఇప్పుడు గవర్నర్‌నూ పిలిచారట

  • బయటపడనున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి బంధం

  • అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రచారం

  • సృజన్‌కు బీఆర్‌ఎస్‌ హయాంలోనే వేల కోట్ల పనులు

  • పదేళ్ల తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు

  • టెస్టు ఫార్మాట్‌లో కాంగ్రెస్‌.. ట్వంటీ-20 ఆడాలి

  • ప్రజల సమస్యలు నేరుగా తెలిసే యాప్‌ అవసరం

  • పదేళ్లు అధికారంలో ఉండి దాడులను సమర్థిస్తారా?

  • నిందితులు, ప్రోత్సహించిన వారిని శిక్షిస్తాం

  • ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అడ్డా కార్యక్రమం, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశా

నేను ఎన్నడూ టీఆర్‌ఎ్‌సలో పని చేయలేదు. కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మందితోపాటు నేను కూడా కేసీఆర్‌కు ఫైనాన్స్‌ చేశాను. అప్పట్లో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. దానిని కేసీఆర్‌ తన పెట్టుబడిగా మార్చుకున్నారు.

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీ సిద్ధంగా ఉంది. 17ఏ కింద గవర్నర్‌ అనుమతి కోరాం. ఈ నిబంధన కింద గవర్నర్‌ అనుమతి ఇచ్చి తీరాలి. కానీ, 15 రోజులుగా గవర్నర్‌ వద్దే పెండింగ్‌లో ఉంది. రెండు రోజుల కిందట కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారు. ఇప్పుడు గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. గవర్నర్‌ అనుమతి రాకుండా.. ఈ రేస్‌ స్కామ్‌ నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారని ఆరోపించారు. దాంతో, బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి బంధం బయటపడుతుందన్నారు. బీజేపీ అవినీతి పార్టీ అని, దానిని అంతం చేస్తామని కేటీఆర్‌ అన్నారని, మరి, ఇప్పుడు వినతి పత్రాలు పట్టుకుని ఆ పార్టీ నేతలను ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అడ్డా’ కార్యక్రమంలోనూ, అక్కడే మీడియాతోనూ రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

Untitled-1 copy.jpg


అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌ చేసిన అవినీతిపై విచారణ మొదలైందని, దానికి జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలని అనుకుంటున్నారని విమర్శించారు. ‘‘తెలంగాణ, ఏపీలో ఏ రెడ్డి అయినా నాకు దగ్గరో, దూరపు బంధువో అవుతాడు. సృజన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌ రెడ్డి అల్లుడే. సృజన్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చింది. ఆధారాలన్నీ ఉన్నాయి. ఆయన కుటుంబం దోచుకున్న విషయంపై చర్చ జరగకుండా ఉండడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని వివరించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య తేడా లేదని, రెండూ కవల పిల్లలేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు మద్దతునిచ్చిన శరద్‌ పవార్‌ తరఫుననైనా ప్రచారం చేయవచ్చు కదా అని అన్నారు. కానీ, మహారాష్ట్రలో కాంగ్రె్‌సకు ఓటు వేయవద్దని కేటీఆర్‌ చెబుతున్నారని, అంటే బీజేపీకి వేయమనే కదా అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు కోల్పోయారని, ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారని ఎద్దేవా చేశారు. వాళ్లను చూసి జాలి పడడం తప్ప, ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.


  • బాబు.. నితీశ్‌ తలచుకుంటే..

చంద్రబాబు నాయుడు, నితీశ్‌ కుమార్‌ తలచుకుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క ఏడాది కూడా అధికారంలో కొనసాగదని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. అప్పుడు కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో 400 సీట్లు తెస్తానని మోదీ చెప్పుకొన్నారని, ఆ సంఖ్యను తాము 240కి తగ్గించగలిగామని చెప్పారు. బీజేపీ ఓడిపోయిందని తాను చెప్పడం లేదని, కానీ, మోదీ ఓడిపోయారని అన్నారు. ప్రతి అంశానికీ మోదీకే ఘనత ఆపాదిస్తూ ప్రచారం చేయడమే ఇందుకు కారణమన్నారు. మోదీ గ్యారంటీ వారంటీ పూర్తయిందని, ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌ అండతో నడుస్తోందని, కొద్దిగా తేడా వస్తే సంగతి అంతేనని వ్యాఖ్యానించారు.

  • కుల గణన.. కాంగ్రెస్‌ 3.0

మోదీ రాకముందు దేశానికి రూ.25 లక్షల కోట్ల అప్పు ఉండేదని, గత పదేళ్లలో మోదీ రూ.188 లక్షల కోట్ల అప్పు చేశారని సీఎం రేవంత్‌ చెప్పారు. అందులో కొంత డబ్బు వెచ్చించి 16 లక్షల కోట్ల కార్పొరేట్ల అప్పులను మాఫీ చేశారని ఆరోపించారు. ‘‘మేం ఆరు గ్యారంటీలను అమలు చేస్తే.. రైతుల రుణాలు మాఫీ చేస్తే.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు. ధర్నాలు చేయిస్తున్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతకు మద్దతు ఇస్తే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కానీ, కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసే బీజేపీ.. పేదలకు డబ్బులు పంచితే విమర్శిస్తోంది’’ అని రేవంత్‌ మండిపడ్డారు. నెహ్రూ, ఇందిరా గాంధీ ఎస్సీ, ఎస్టీలకు 32 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అది కాంగ్రెస్‌ 1.0 అని, పీవీ నరసింహారావు మండల్‌ కమిషన్‌ తీసుకొచ్చారని, అది 2.0 అని, రాహుల్‌ గాంధీ కుల గణన చేస్తారని, అది కాంగ్రెస్‌ 3.0 అని చెప్పారు. అధికారం ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీలకు కూడా రావాల్సి ఉందని, ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని, పదేళ్ల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోతాయని రేవంత్‌ అభిప్రాయపడ్డారు.


  • ఉత్తరాది.. దక్షిణాది వాదన ఇందుకే

మోదీ హయాంలో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోందని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ‘‘దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఎంతో కంట్రిబ్యూట్‌ చేస్తున్నాయి. తెలంగాణ నుంచి ఒక రూపాయి దేశానికి చెల్లిస్తే.. కేంద్రం 40 పైసలే వెనక్కి ఇస్తోంది. కానీ, బిహార్‌ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి తిరిగి రూ.7.06 పొందుతోంది. జనాభా ఆధారంగా నిధులు పంచుతున్నారు. ఇది సరికాదు. జనాభాకు 50 శాతం, పురోగతిని చూసి 50 శాతం నిధులు ఇవ్వాలని నీతీ ఆయోగ్‌ తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పాను. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు కూడా 50 శాతం కోటా.. 50 శాతం మెరిట్‌ను చూడమంటుంది. దానినే అనుసరించాలి. అంతే తప్ప జనాభా ఆధారంగానే ఇస్తే ఎలా!?’’ అని ప్రశ్నించారు. 2025 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్లను పెంచితే.. ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దక్షిణాది ఓట్లు అవసరం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు దక్షిణాదిలో 123 సీట్లు ఉన్నాయని, అవి ఇంకా తగ్గుతాయని, అప్పుడు తమ పాత్ర (దక్షిణాది రాష్ర్టాల)తక్కువగా లేదా విమర్శించతగిన స్థితిలో మాత్రమే ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తుంటే.. ఆర్థిక వ్యవస్థకు ఇంతగా కంట్రిబ్యూట్‌ చేస్తుంటే.. మమ్మల్ని శిక్షిస్తే ఎలా అని నిలదీశారు. తాము నోరు ఎత్తకుండా ఎలా ఉంటామని, తమ హక్కులను రక్షించుకునేందుకు సహజంగానే దక్షిణాది-ఉత్తరాది వాదన వస్తుందని స్పష్టం చేశారు.

  • మోదీ భద్రాచలం వస్తే నేను అయోధ్యకు

ఏబీవీపీ, టీడీపీ, కాంగ్రె్‌సల్లో ఏయే లక్షణాలు అంటే మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఏబీవీపీకి దేశం పట్ల ఉన్న అంకిత భావం, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి పట్ల ఉన్న దృక్పథం, కాంగ్రె్‌సలో సామాజిక న్యాయం తనకు ఇష్టమని ముఖ్యమంత్రి రేవంత్‌ చెప్పారు. ఒకప్పటి ఏబీవీపీ నేతగా అయోధ్యలో రామ మందిరానికి వెళతారా? అని ప్రశ్నించగా.. తనకు అయోధ్య కంటే భద్రాచలం రామ మందిరానికి వెళ్లడమే ఇష్టమని చెప్పారు. ఇంతవరకూ మోదీ, అమిత్‌ షాలు భద్రాచలం రాకపోవడం బాధాకరమని అన్నారు. భద్రచలానికి మోదీ, అమిత్‌ షా వచ్చినప్పుడు తాను కూడా అయోధ్యకు వెళతానని చెప్పారు.


  • కాంగ్రెస్‌ 20 ట్వంటీ ఆడాలి

కాంగ్రెస్‌ సుధీర్ఘ ఆలోచన కలిగిన పార్టీ అని, ఇప్పటికీ టెస్టు ఫార్మాట్‌ ఆడుతోందని, పార్టీ తన విధానాలను మార్చుకుని 20-20 ఆడాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. హరియాణాలో స్థానిక అంశాల ప్రాతిపదికగా ఎన్నికలకు వెళ్లారని, నరేంద్ర మోదీని అడ్డుకునేందుకు రాహుల్‌ గాంధీ నాయకత్వం అవసరమని, హరియాణాలో గెలిస్తే రాహుల్‌ దేశ ప్రధాని అవుతారని ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్‌ గెలిచేదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా మోదీ వర్సెస్‌ రాహుల్‌ అన్నట్లు పోటీ జరగాలన్నారు. బీజేపీ హిందుత్వ కార్డు హిమాచల్‌ ప్రదేశ్‌, కశ్మీరుల్లో పని చేయలేదని తెలిపారు. స్థానిక అంశాలను అధిగమించేందుకు బ్రాండ్‌ అవసరమని, మోదీ పరివార్‌ వర్సెస్‌ రాహుల్‌ పరివార్‌ పేరుతో ఎన్నికల్లో దిగాలని సూచించారు. కేవలం సంక్షేమంతో ఎన్నికల్లో గెలవలేమని స్పష్టం చేశారు.

  • ఆ ధర్నా చౌక్‌లోనే కేటీఆర్‌, హరీశ్‌ ఆందోళన

తెలంగాణకు గుజరాత్‌ నమూనా లేదా మరో రాష్ట్రం ఆదర్శం కాదని, హైదరాబాద్‌ను న్యూయార్క్‌, సియోల్‌, టోక్యోలా అభివృద్ధిపరచడమే తన లక్ష్యమని సీఎం రేవంత్‌ చెప్పారు. తాను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, అభివృద్ధి ఏమిటో చూపిస్తానని తెలిపారు. ‘‘కేసీఆర్‌ పాలనలో ప్రజాస్వామ్యం లేదు. పదేళ్లు సచివాలయానికి రాలేదు. ప్రతిపక్ష నేతగా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నిరసన ప్రదర్శనలు చేయకుండా ధర్నా చౌక్‌ వద్ద ఆంక్షలు పెట్టారు. ఇప్పుడదే ధర్నాచౌక్‌ వద్ద కేటీఆర్‌, హరీశ్‌ రావులు రెండు రోజులకోసారి ధర్నాలు చేస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు.


  • అటువంటి యాప్‌ నేటి అవసరం

చిన్న చిన్న మొత్తాలకు ఫైళ్లు కింది నుంచి పై వరకు తిరగడం, రోజుల తరబడి పెండింగ్‌లో ఉండడం తనకు ఇష్టం లేదని, బ్యూరోక్రసీ, రెడ్‌ టేపిజం లేకుండా ప్రజలు నేరుగా తమ సమస్యలను డాష్‌ బోర్డ్‌ ద్వారా తెలిపే యాప్‌ అవసరమని సీఎం రేవంత్‌ ఆకాంక్షించారు. ప్రస్తుతం చదువుకోవడం ముఖ్యం కాదని, నైపుణ్యం అవసరమని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. 2 సెంటీ మీటర్ల వర్షం వస్తుందని ఊహించి హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలను నిర్మించారని, కానీ, గత నెలలో కేవలం 3 గంటల్లోనే 19 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో దూరదృష్టితో కూడిన నిర్ణయాలు చేయాలని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజన సమస్యలు ఉన్నమాట నిజమేనని, వాటిని రెండు రాష్ట్రాలూ పరస్పరం ప్రయోజనం కలిగించే విధంగా పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యానించారు. అందుకోసం తాము ఢిల్లీ వచ్చి కేంద్రం మధ్యవర్తిత్వాన్ని కోరాల్సిన అవసరం లేదని చెప్పారు. నాయకులకు దృక్పథం అవసరమని, నేతలు తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే పదవికి 21 ఏళ్ల యువకులు ఎందుకు పోటీ పడకూడదని ప్రశ్నించారు. 25 ఏళ్ల వరకూ ఎందుకు వేచి ఉండాలని రేవంత్‌ ప్రశ్నించారు ఇలాంటి వాటిపై చర్చ జరగడం లేదన్నారు.


  • మరాఠా ఆత్మ గౌరవాన్ని గుజరాత్‌ నాశనం చేస్తోంది

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం గుజరాత్‌ వర్సెస్‌ మహారాష్ట్ర అన్నట్లు జరుగుతోందని, మరాఠా ఆత్మ గౌరవాన్ని గుజరాత్‌ నాశనం చేస్తోందని, వారి నేతలను ఖతం చేస్తోందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. శివాజీ, పూలే, అంబేడ్కర్‌, బాల్‌ ఠాక్రే, పవార్‌, చవాన్‌ వంటి నేతలు ఉన్నచోట్ల ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌ వంటి కోవర్టులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులను గుజరాత్‌కు తీసుకెళ్లిపోతున్నారని ఆరోపించారు. ‘‘తెలంగాణను గాంధీ కుటుంబం ఏటీఎం చేసిందని ప్రధాని స్థాయి వ్యక్తి విమర్శలు చేయడం సరికాదు. గాంధీ కుటుంబానికి డబ్బులే కావాలంటే దేశం కోసం ప్రాణాలెందుకు అర్పించేది!? ఇందిరమ్మ పేరుతో ఎంతో మంది పేదలకు ఇండ్లు ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం ఆమె మనవడు రాహుల్‌ గాంధీకి నీడ లేకుండా తుగ్లక్‌ రోడ్‌లోని నివాసాన్ని ఖాళీ చేయించింది’’ అని వ్యాఖ్యానించారు.

  • మోదీ మోడల్‌ వేరు.. కాంగ్రెస్‌ నమూనా వేరు

మోదీ మోడల్‌ వేరు.. కాంగ్రెస్‌ నమూనా వేరు అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. నవ రత్నాలతో సహా దేశంలో అన్నిటినీ అదానీ, అంబానీలకే మోదీ అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్కిల్స్‌ యూనివర్సిటీకి అదానీ వంద కోట్లు పెట్టుబడులు పెట్టారని, ఈ మొత్తం యువతకు తోడ్పడుతోందని, దానిని తాను ఎలా అడ్డుకుంటానని ప్రశ్నించారు. తానేమీ అదానీకి రేవులు, విమానాశ్రయాలు, ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయలేదని చెప్పారు. అందరు పారిశ్రామికవేత్తల పట్ల సమానంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు.

  • అధికారులపై దాడులను సమర్థిస్తారా!?

అధికారులపై దాడులు చేస్తే పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఖండించాల్సింది పోయి సమర్థించడం సరి కాదని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. రాష్ట్రంపై వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో దీనినిబట్టే తెలుసుకోవచ్చని చెప్పారు. ‘‘భూ సేకరణ చేయాలా? వద్దా? అనేది ఒక అంశం. దానిపై బీఆర్‌ఎస్‌, నిర్వాసితులు ఎవరైనా అభిప్రాయాలు చెప్పొచ్చు, తప్పులేదు. కానీ, అధికారులను పాశవికంగా చంపాలని చూడడాన్ని బీఆర్‌ఎస్‌ ఏ విధంగా సమర్థించుకుంటుంది!? ఈ సంస్కృతి సరికాదు. ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద దాడులను ఎవరైనా సమర్థిస్తారా?’’ అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దాడులు చేసిన వాళ్లు, వాళ్లను ప్రోత్సహించేవాళ్లు, అండగా నిలిచిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 03:29 AM