CM Revanth : మూసీపై ముందుకే!
ABN , Publish Date - Oct 30 , 2024 | 06:01 AM
‘‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందుకే వెళతాం. దశలవారీగా చేపడతాం. ఈ ప్రాజెక్టుతో ఇంకో నగరాన్నే సృష్టిస్తాం. మిగతా నగరమంతా పగలు నడిస్తే.. మూసీ ఒడ్డున నిర్మించే నగరం మాత్రం రాత్రి నడుస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుతో మరో నగరాన్ని సృష్టిస్తాం
తొలి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి
బాపూ ఘాట్ వద్ద అతి పెద్ద గాంధీ విగ్రహం
బెంగళూరు జిందాల్ తరహాలో ప్రకృతి చికిత్స కేంద్రం
స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఏర్పాటు
వినోదానికి లండన్ ఐ తరహాలో భారీ జెయింట్ వీల్
చెక్ డ్యాం కమ్ వంతెన.. 30 కిలోమీటర్ల రింగ్
ఇక్కడ గజం 10 వేలు ఉంటే 5 లక్షలు కూడా కావచ్చు
ప్రాజెక్టుపై ప్రజలకు 45 రోజుల్లో ప్రజంటేషన్
ఆరున్నర ఏళ్లలో మొత్తం ప్రాజెక్టు అభివృద్ధి
అభివృద్ధి కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ కృషి
రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గడానికి హైడ్రా కారణం కాదు
ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థుల్లో 52% బీసీలే.. ఓసీలు 9%
రాజకీయంగా కోరుకునేదేం లేదు.. తిరిగివ్వడమే..
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయానికి ముగింపు
కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్. ఎన్నికల ముందే ఇది చెప్పాను. కేసీఆర్‌ను మరిపించేందుకే ఇప్పుడు కేటీఆర్‌ను ప్రస్తావిస్తున్నాం. కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది. ఆ తర్వాత బావ(హరీశ్‌రావు)తో బామ్మర్ది (కేటీఆర్) రాజకీయం ముగుస్తుంది. ఇక బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందుకే వెళతాం. దశలవారీగా చేపడతాం. ఈ ప్రాజెక్టుతో ఇంకో నగరాన్నే సృష్టిస్తాం. మిగతా నగరమంతా పగలు నడిస్తే.. మూసీ ఒడ్డున నిర్మించే నగరం మాత్రం రాత్రి నడుస్తుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టును ఆరున్నరేళ్లలో పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రణాళిక వచ్చిన తర్వాత వికారాబాద్ నుంచి వాడపల్లి (మూసీ నది కృష్ణా నదిలో కలిసే చోటు) వరకు తాను పాదయాత్రకు సిద్ధమని, కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తొలి దశలో.. మూసీ, ఈసీ నదులు కలిసే బాపూఘాట్ సంగమం వరకూ ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామన్నారు.
‘‘మూసీ నది గండిపేట నుంచి 11.5 కిలోమీటర్లు, ఈసీ నది హిమాయత్ సాగర్ నుంచి 9.5 కిలోమీటర్లు ప్రవహించి బాపూఘాట్ వద్ద కలుస్తాయి. తొలి దశలో ఆ ప్రాంతాన్ని ప్రక్షాళన చేస్తాం. బాపూజీ సిద్ధాంతం, ఆరోగ్యం, విద్య, వినోదం.. ఈ నాలుగు అంశాల థీమ్‌తో బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. గాంధీ ఐడియాలజీ కేంద్రాన్ని నిర్మిస్తాం. బెంగళూరులోని జిందాల్ ప్రకృతి ఆశ్రమం తరహాలో ఇక్కడ కూడా ప్రకృతి చికిత్స ఆశ్రమం నిర్మిస్తాం.
స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన ఆఫ్ క్యాంపస్ సెంటర్‌ను ఇక్కడ ప్రారంభిస్తాం. ఇక, వినోదం కోసం లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న ‘లండన్ ఐ’ వంటి భారీ జెయింట్ వీల్‌ను ఏర్పాటు చేస్తాం. బాపూఘాట్ వద్ద చెక్‌డ్యాం కమ్ వంతెన నిర్మిస్తాం. అక్కడి నుంచి కిందకు మూసీలోకి వదిలే నీరు స్వచ్ఛంగా ఉండేలా చూస్తాం. 30 కిలోమీటర్ల మేర రింగ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని వివరించారు. పర్యావరణ హిత థీమ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి రోజు లక్ష మంది సందర్శించేలా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు.. అక్కడి నుంచి హిమాయత్ సాగర్‌కు గోదావరి నీటిని తరలించేందుకు ట్రంక్ లైన్ నిర్మాణం కోసం నవంబరు మొదటి వారంలో టెండర్లను పిలుస్తామన్నారు. బాపూఘాట్ పైభాగంలో వచ్చి కలిసే నీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన ఎస్‌టీపీల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్నారు.
ప్రణాళికే పెట్టుబడి.. డబ్బులు ప్రైవేటువే
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఈ అభివృద్ధి ప్రణాళికే మా పెట్టుబడి. దీన్ని తయారు చేశాక 10 దేశాల్లో రోడ్ షోలు నిర్వహించి ప్రదర్శిస్తాం. పెట్టుబడిదారులు వస్తారు. పెట్టుబడి అంతా ప్రైవేటు కంపెనీలదే. ఈ ప్రణాళిక అంతా అమలైతే మూసీ నది ఒడ్డున మాకో అపార్ట్‌మెంట్ ఉందని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. రూ.10 వేలు ఉన్న గజం ధర.. రూ.5 లక్షలు కూడా కావొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. గండిపేటలో కూల్చిన ఫామ్‌హౌ్‌సలు బలిసినోళ్లవని, వాళ్ల డ్రెయిన్ నీళ్లు గండిపేటలో కలిపితే కింద ఉన్నవాళ్లు తాగాల్సి వస్తోందని, అందుకే నిర్దాక్షిణ్యంగా కూల్చేశామని తేల్చి చెప్పారు. కానీ, మూసీ నిర్వాసితుల విషయంలో అలా కాదని, డబుల్ బెడ్ రూం ఇల్లు, పరిహారం తీసుకోవడానికి అంగీకరించిన వారివే తొలగిస్తున్నామని, నిర్వాసితులకు వీలైనంత మేర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇంకో హైదరాబాద్ అంత వ్యాపారం.. బాధితులకూ భాగస్వామ్యం
‘‘మూసీ నదిని అభివృద్ధి చేయాలని నాకు ఏ దేవుడూ చెప్పలేదు. నేనూ హామీ ఇవ్వలేదు. కానీ, రాష్ట్ర ఆదాయంలో 55 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. మూసీ అభివృద్ధి చేస్తే నగర ఆదాయం మరింత పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రణాళిక రూపకల్పన కోసం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఐదు సంస్థల కన్సార్షియంకు బాధ్యతలు అప్పగించామని, 45 రోజుల్లో ప్రాథమిక; 18 నెలల్లో సమగ్ర ప్రణాళికను అందిస్తారని తెలిపారు. దానిపై ప్రభుత్వం ప్రజలకు ప్రజంటేషన్ ఇస్తుందని వెల్లడించారు. ‘‘మూసీ ఒడ్డున ఉన్నది చిన్న వ్యాపారులు. చిరుద్యోగులే. వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం. స్వయం సహాయక బృందాల తరహాలో నిర్వాసితులను గ్రూప్‌లుగా ఏర్పాటు చేస్తాం. వారికి కొన్ని షాపులను కేటాయిస్తాం. ప్రాజెక్టు పూర్తయ్యాక వ్యాపారానికి ఇంకో సైకిల్ అదనంగా కలుస్తుంది’’ అని రేవంత్ వివరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో పగలు వ్యాపారం జరుగుతోందని, మూసీ ఒడ్డున షాపింగ్, వినోదం, విహారం వంటివన్నీ రాత్రిళ్లు ఉంటాయని, ఇంకో హైదరాబాద్ అంత వ్యాపారం మూసీ ఒడ్డున రాత్రిపూట జరుగుతుందని చెప్పారు.
కేటీఆర్ ఎందుకు వద్దంటున్నారో అర్థం కావట్లేదు
దుబాయ్‌ని ఒక కాన్సె్‌ప్టతో అభివృద్ధి చేశారని, ఇప్పుడు డబ్బులున్న వారంతా దేశ, విదేశాల నుంచి వెళ్లి, చూసి అక్కడ ఖర్చు చేస్తున్నారని, హైదరాబాద్‌లోనూ అలాగే జరుగుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు. ‘‘కేటీఆర్ బావమరిదిలా అందరికీ ఫామ్‌హౌ్‌సలు, విలాసవంతమైన ఇళ్లు ఉండవు. సామాన్యులు కూడా తమ పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఆనందించేలా అభివృద్ధి ఉంటుంది. ఒక వ్యక్తికి కావాల్సిన అన్ని వస్తువులూ షాపింగ్ చేసుకునేలా ఏర్పాటు చేస్తాం. పదేళ్లు అధికారంలో ఉండి అమెరికా, లండన్ తిరిగొచ్చిన కే టీఆర్ ఇక్కడ మూసీని, పేదలను అభివృద్ధి చేయవద్దని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ జరిగేది ఏదైనా నా ఇంటికొస్తుందా? గతంలో ఒకాయన ఔటర్ రింగ్ రోడ్డు ఆలోచన చేస్తే.. ఇంకో ఆయన దాన్ని అమలు చేశారు. ఒకాయన ఐటీకి శంకుస్థాపన చేస్తే.. చంద్రబాబు దాన్ని అభివృద్ధి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. ఇప్పుడు ప్రతిపక్షానికి మాత్రం ఆ బాధ్యత ఎందుకు లేదో అర్థం కావడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రణాళిక సిద్ధం కాకుండానే నిర్వాసితులను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారని ప్రశ్నించగా.. ఎంత భూమి అందుబాటులోకి వస్తుందనేది తెలిస్తే కానీ ప్రణాళిక వేయలేరని, ఒకవేళ ప్రణాళిక వేసేశాక అక్కడ భూమి అందుబాటులోకి రాకుంటే మొత్తం ప్రాజెక్టుకే దెబ్బ తగులుతుందని వివరించారు. ప్రణాళిక తయారు చేస్తున్న సంస్థలు కూడా ఎంత భూమి ఇస్తారో చెప్తేనే.. కార్యాచరణ ప్రణాళిక చేయగలమని చెప్పాయని బదులిచ్చారు.
రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు?
‘‘మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు. వాళ్లకు సారా బుడ్లు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదు’’ అని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీపై సీఎం రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అక్కడ విదేశీ మద్యం, క్యాసినో కాయిన్లు, కొకైన్ తీసుకున్న వ్యక్తి, పేకలు అన్నీ ఉన్నాయని, ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు.
కేసీఆర్ చేసిన అప్పులకు బాకీలు మేం కడుతున్నాం
మూడు లక్షల కోట్లు అప్పు చేశామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందని, కానీ, రూ.7.5 లక్షల కోట్లు అప్పు చేసినట్లు తేలిందని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘పది నెలల్లో మేం చేసిన అప్పు రూ.49 వేల కోట్లు. కానీ. చెల్లించిన బాకీలు రూ.56 వేల కోట్లు. అంటే.. కేసీఆర్ చేసిన అప్పుల తాలూకు బాకీలను మేం కడుతున్నాం. మేం తెచ్చిన అప్పుల కంటే 7 వేల కోట్లు అధికంగా ఆ చెల్లింపులు చేశాం. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వం తరహాలో ఈ 10 నెలల్లో మేం హైదరాబాద్, రంగారెడ్డిల్లో భూములు అమ్మలేదు. కానీ, రూ.17,800 కోట్ల రుణ మాఫీ చేశాం. 200 యూనిట్లలోపు విద్యుత్తును ఎంతమంది అర్హులుంటే అంతమందికీ ఉచితంగా ఇస్తున్నాం. రూ.500లకే సిలిండర్ అందిస్తున్నాం. ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు నెల మొదట్లోనే ఇస్తున్నాం. మద్యం సరఫరాదారులకు కేసీఆర్ రూ.4 వేల కోట్ల బకాయిలు పెడితే క్లియర్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు రూ.52 వేల కోట్ల బిల్లులు బకాయి పెడితే.. అందులో ఇప్పటికే రూ.10 వేల కోట్లు చెల్లించాం’’ అని సంక్షేమ హామీలు ఇంకా అమలు చేయాల్సి ఉంది కదా అన్న ప్రశ్నకు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఆర్థిక పరిస్థితిని సమన్వయం చేసుకుంటున్నామని, మిగతా హామీలను కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
రియల్ ఎస్టేట్ దేశమంతా పడింది..
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయిందని, హైడ్రానే ఇందుకు కారణమని అంటున్నారని, కానీ, హైడ్రా లేని వరంగల్‌లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయిందని సీఎం రేవంత్ తెలిపారు. రియల్ ఎస్టేట్ దేశమంతా పడిపోయిందని, ఆర్థిక మాంద్యమే దీనికి కారణమని తెలిపారు.
వర్మ - రాజమౌళి.. ఎవరి స్టైల్ వారిదే!
‘‘రాంగోపాల్ వర్మ సినిమా రిలీజ్‌కు ముందు హడావుడి ఎక్కువ ఉంటుంది. సినిమా బాగుంటుందా? లేదా? అన్నది తర్వాతి సంగతి. అదే రాజమౌళి సినిమాకు రిలీజ్‌కు ముందు హడావుడి తక్కువ ఉంటుంది. ఎవరి దారి వారిదే. కేటీఆర్‌లా రేవంత్ రెడ్డి ఉండాలంటే ఎలా?’’ అని ఓ ప్రశ్నకు జవాబుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని, ఈ ఆటలో ప్రతి ఆటగాడు ప్రత్యర్థి జట్టులోని మరో ఆటగాడిని మ్యాపింగ్ చేస్తాడని, అతడిని అలిసిపోయే దాకా పరిగెత్తించి అప్పుడు గోల్ వైపు బంతిని తీసుకెళతాడని, కేటీఆర్, హరీశ్, ఈటల కూడా అలానే అలసిపోతారని చెప్పారు.
కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయం ముగింపు
మూసీ నది ప్రక్షాళన వ్యవహారంలో మీరు కేసీఆర్‌ను వదిలేసి కేటీఆర్‌నే విమర్శిస్తున్నారు. ఆ మేరకు కేటీఆర్ సక్సెస్ అయినట్లేనా? అని ప్రశ్నించగా.. ‘‘కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్. ఎన్నికల ముందే ఇది చెప్పాను. కేసీఆర్‌ను మరిపించేందుకే ఇప్పుడు కేటీఆర్‌ను ప్రస్తావిస్తున్నాం. కేటీఆర్‌తోనే కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది. ఆ తర్వాత బావతో బామ్మర్ది రాజకీయం ముగుస్తుంది. ఇక బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు’’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీపావళిలోపే బాంబులు పేలతాయని పొంగులేటి అన్నారుగా అని ప్రశ్నించగా.. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ విచారణలు కొనసాగుతున్నాయని, చట్టప్రకారమే చర్యలు ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్ మారవద్దా!?
కేటీఆర్ ఇటీవల మూసీ నిర్వాసిత చిన్నారి ఒకరిని కలిశాడని, ఆమెకు ఒక ఇల్లు ఇస్తారేమోనని అనుకున్నానని, కానీ, నీళ్ల సీసా మాత్రం ఇచ్చాడని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘మూసీని ఇలానే వదిలేస్తే మూసుకుపోతుంది. మూసీ మూసుకుపోతే హైదరాబాద్ నగరానికే పెనుప్రమాదం. కేటీఆర్, కేసీఆర్ తాతలు గోచీ పెట్టుకుని ఉండేవాళ్లు. కానీ, కేసీఆర్, కేటీఆర్ పరివర్తన చెంది సూట్‌లు వేసుకునే వరకూ వచ్చారు. మరి హైదరాబాద్ మాత్రం పరివర్తన చెందొద్దా?’’ అని రేవంత్ ప్రశ్నించారు.
గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థుల్లో 52% బీసీలే
గ్రూప్-1 పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయని, కానీ, పరీక్ష అయ్యాక టీజీపీఎ్‌సస్సీ వెబ్‌సైట్‌లో పెట్టిన వివరాల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల్లో 52 శాతం బీసీలే ఉన్నారని సీఎం రేవంత్ వివరించారు. ఓసీలు 9 శాతం మంది మాత్రమే ఉన్నారని తేలిందన్నారు.
తిరిగి ఇవ్వడమే ఇక మిగిలింది
ప్రజలు రాజకీయంగా తనకు ఇవ్వాల్సింది ఇచ్చేశారని, ఇక ఇంతకంటే కోరుకునేది ఏమీ లేదని, ప్రజలకు తిరిగి చేయడమే మిగిలిందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘నేను కోరుకోవడానికి ఇక ఏమీ లేదు. ప్రజలకు చేయడమే మిగిలింది. నా వయసు, ఓపిక, శక్తి అన్నీ ప్రజలకు తిరిగి చేసేందుకే ఉపయోగిస్తా’’ అని చెప్పారు. మరోవైపు, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు.