PM Modi: మోదీజీ.. రుణమాఫీ లెక్కలివిగో..
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:32 AM
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తప్పుడు హామీలు ఇస్తాయని.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
రైతుల ఖాతాల్లో 17,869 కోట్లు వేశాం
22 లక్షలమందిని రుణ విముక్తుల్ని చేశాం
మాఫీపై మీ వ్యాఖ్యలు చాలా బాధాకరం
రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు
ప్రధానికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తప్పుడు హామీలు ఇస్తాయని.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. కేవలం 27 రోజుల వ్యవధిలోనే 22,22,067 మంది రైతుల ఖాతాల్లో రూ. 17,869.22 కోట్లు జమచేసి రైతులను రుణవిముక్తులను చేశామని వివరించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మహారాష్ట్రలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీ ఇచ్చిందని, ఈనాటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ విమర్శలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం స్పందించారు. ‘‘మీరు చేసిన ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. వాస్తవ విరుద్ధంగా ఉన్న మీ ప్రకటన చాలా బాధ కలిగించింది’’ అని రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. రుణమాఫీపై వాస్తవాలు, గణాంకాలను లేఖలో వివరించారు. 22.22 లక్షల మంది రైతులకు రూ.17,869 కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేసి, 2 లక్షల వరకు రుణవిముక్తులను చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తోందని తెలిపారు.
రైతులపై ఆర్థిక భారాన్ని, అప్పుల ఒత్తిడిని తగ్గించి.. రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదకతకు దోహదపడేలా వారికి అండగా నిలబడుతున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రూ.2 లక్షలకు మించి రుణ బకాయిలున్న అన్నదాతలు కూడా ఉన్నారని.. వారు 2 లక్షలకు పైన ఉన్న మొత్తాన్ని చెల్లించిన తర్వాత, వారికి కూడా రూ.2 లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్లు స్పష్టంచేశారు. రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు వెచ్చించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ‘‘రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మీ మద్దతు చాలా అవసరం. రైతుల సంక్షేమానికి, రాష్ట్రంలో వ్యవసాయరంగ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు ముఖ్యం.
రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా, కష్టపడి పనిచేసే రైతాంగంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి మీరు, మేము కలిసి కృషి చేద్దాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి పారదర్శకత కోసం రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో చేస్తున్న ప్రయత్నాలు రైతుల సంక్షేమానికి దోహదపడతాయని ధృడంగా నమ్ముతున్నట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని, పూర్తి సహకారం అందించాలని ప్రధానమంత్రి మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు.
దశ మాఫీ తేదీ రైతుల ఖాతాలు బదిలీ చేసిన నగదు రైతుల కేటగిరీ
ఒకటో దశ 18 జులై 2024 11,34,412 రూ. 6,034.97 కోట్లు లక్ష వరకు
రెండో దశ 30 జులై 2024 6,40,823 రూ. 6,190.01 కోట్లు 1.50 లక్షల వరకు
మూడో దశ 15 ఆగస్టు 2024 4,46,832 రూ. 5,644.24 కోట్లు 2 లక్షల వరకు
మొత్తం 22,22,067 17,869.22 కోట్లు