CM Revanth Reddy: అమ్మ రూపమే
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:43 AM
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు.
ప్రతి ఇంట్లోని కన్న తల్లిలా తెలంగాణ తల్లి
నమూనాను మార్చితే ఊరుకోం.. అవమానిస్తే చట్టపరంగా చర్యలు
తెలంగాణ తల్లి.. ఉద్యమ కాలం నుంచీ ఓ ఉద్వేగం! ఆ ఉద్వేగానికి ఇప్పుడు అధికారిక రూపం వచ్చింది! ప్రశాంత వదనంతో.. ఆకుపచ్చ చీరలో గ్రామీణ మహిళను పోలి ఉండే రూపంతో ఉన్న విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో రేవంత్ సర్కారు ఏర్పాటు చేసింది! హుస్సేన్ సాగర్ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లిని బహుజనుల తల్లిగా అభివర్ణించారు. ప్రతి ఇంట్లోని తల్లికి ప్రతి రూపమే విగ్రహ రూపమని, దానిని మార్చినా.. ఏ రూపంలో అవమానించినా చట్టపరంగా తీవ్ర చర్చలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ తల్లిపై తొలుత అసెంబ్లీలోనూ ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో జరిగిన సభలోనూ ఆయన మాట్లాడారు.
తెలంగాణ సంస్కృతికి రూపమైన బహుజన తల్లి
జాతి అస్తిత్వానికి ప్రతీకగా విగ్రహ రూపకల్పన
మేధావులు, ఉద్యమకారుల అభిప్రాయం మేరకే
గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు
టీజీని పునరుద్ధరించి.. రాష్ట్ర గీతాన్ని ప్రకటించాం
9మంది ఉద్యమకారులకు రూ.కోటి, 300 గజాలు
అసెంబ్లీ, విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్
రాష్ట్ర వేడుకగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం
మండల స్థాయి వరకు ‘డిసెంబరు 9’ పండుగ
ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహణకు ఆదేశాలు
తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు మాటలు, చేతలతో అగౌరవ పరచడం నేరం
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఇంట్లోని కన్నతల్లిని చూసిన భావన కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ అమ్మను చూసిన భావన కలిగేలా విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వం ఉట్టిపడేలా బహుజనుల తెలంగాణ తల్లిగా రూపొందించామన్నారు. విగ్రహ రూపకల్పన సందర్భంలో రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, దేవతలా ఉండాలా? సొంత మాతృమూర్తిలా ఉండాలా? అన్న చర్చ జరిగిందని పేర్కొన్నారు. దేవత గుడిలో ఉంటుందని, తల్లి ఇంట్లో ఉంటుందని, మనల్ని ఒడిలో పెట్టుకుని పెంచుతుందని గుర్తు చేశారు. పైగా అందుకే తల్లి రూపమే ఉండాలన్న అభిప్రాయాల మేరకు బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని వెల్లడించారు. సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనుమతితో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన సందర్భంలో రెండు అంశాలు చర్చకు వచ్చాయి. విగ్రహం.. వజ్ర వైడూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులతో దేవతలా ఉండాలా? లేక మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మన అమ్మలా ఉండాలా? అనే ప్రస్తావన వచ్చింది. మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులందరూ తెలంగాణ తల్లి విగ్రహం మన తల్లిలా ఉండాలని అభిప్రాయపడ్డారు. దేవత గుడిలో ఉంటుంది.. తల్లి మన ఇంట్లో ఉంటుంది. తల్లి ఒడిలోనే మనం పెరుగుతాం కాబట్టి.. తెలంగాణ తల్లి కావాలని చెప్పారు. తల్లి ప్రతిరూపాన్ని పెట్టుకోవాలని సూచించారు. ఆ మేరకే ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసినట్లుగా ఉండే విగ్రహాన్ని రూపొందించాం’’ అని సీఎం అన్నారు.
మాతృమూర్తిలా రాష్ట్రాన్నిచ్చిన సోనియా
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడదీసుకుని వీరోచితంగా పోరాటం చేసిందని సీఎం రేవంత్ అన్నారు. ఆ పోరాటాల్లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ప్రత్యేక భూమికను పోషించాయన్నారు. ‘‘ఉన్నత విద్య కోసం, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని పేదలు, అత్యంత నిరుపేదలైన బహుజనులు తమ పిల్లలను ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు పంపించారు. కానీ, ఆ విద్యార్థులు చదువొక్కటే కాదు.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కూడా పోరాటం చేయాలని భావించారు. లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ పోరాట బాట పట్టారు. వారి స్ఫూరితోనే తొలి దశ, మలి దశ ఉద్యమాలు సాగాయి. వివిధ కారణాల వల్ల ప్రత్యే రాష్ట్ర ఆకాంక్ష వాయిదా పడుతూ వచ్చినప్పుడు... చివరి రక్తపు బొట్టు వరకు, ఆఖరి శ్వాస వరకు, సమిధలైనా పర్వా లేదంటూ ఆనాడు యువత ఉద్యమానికి ముందుకొచ్చింది. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్‌రెడ్డి... ఇలా ఎంతో మంది విద్యార్థులు ఉద్యమకారులు, ఆకాశంలో తారాజువ్వలై, రాష్ట్రం కోసం అమరులయ్యారు. అలాంటి సందర్భంలో సోనియాగాంధీ.. ఒక మాతృమూర్తిగా, రాజకీయ ఆలోచనలను పక్కనపెట్టి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ ప్రకటన ఇప్పించారు. ఆ తర్వాత అవాంతరాలు ఎదురైనా, పార్టీపరంగా ఎన్నో కోల్పోయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రాన్నిచ్చారు’’ అని రేవంత్ వివరించారు.
పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు..
‘‘గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం వంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి కొత్త ప్రభుత్వం వెంటనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉన్నా.. అది జరగలేదన్నారు. బండ్లపైనే కాకుండా.. గుండెలపైనా రాసుకున్న టీజీని పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీనీ పునరుద్ధరించామని ప్రకటించారు. ‘‘వేలాది మందిని ఉద్యమం వైపు నడిపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని అప్పటి ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు. దాంతో పదేళ్లలో రాష్ట్ర గీతమనేదే లేకుండా పోయింది. కానీ ఒక గొప్ప స్ఫూర్తిని, పోరాట పటిమను చూపిన, ఉద్యమ బాట వైపు నడిపించిన గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని అనుకున్నాం. ఇప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా... ఈ గీతాన్ని ఆలపిస్తున్నాం. గత పదేళ్లలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహంలేదు. అందుకే తెలంగాణ భావన, ఆలోచన, ఆత్మగౌరవం, అస్తిత్వం ఉట్టిపడేలా, కవులు, కళాకారులు, ఉద్యమకారులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాం’’ అని సీఎం చెప్పారు.
కొంత మందికి నచ్చలేదు
‘‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వంతో బహుజనుల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు.. డిసెంబరు 9న ఎలాంటి రాజకీయ వివాదాలకు తావు లేకుండా, తెలంగాణ సమాజం, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, రైతు కూలీ సంఘాలు, నాలుగు కోట్ల ప్రజలు ఏక గళంతో తెలంగాణ తల్లి ఉత్సవాలను జరుపుకొంటే బాగుంటుందని భావించాం. అందరూ కలిసి వస్తే ఇతర రాష్ట్రాలు, దేశ ప్రజల్లో మన గౌరవం పెరిగేది. దురదృష్టవశాత్తు కొంత మందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ ఆలోచనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆలోచన, భావన అనుకోవడం సమంజం కాదు. మధ్య యుగాల ఆలోచనలతో ప్రజా ప్రభుత్వం నడవదు. నాలుగు కోట్ల ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, వారి ఆలోచనల ప్రతిరూపమే ఈనాటి ప్రజా ప్రభుత్వం. రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ సచివాలయ గుండెల్లోనే తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలంటూ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని, అసదుద్దీన్ ఒవైసీ, కమ్యూనిస్టు సోదరులు, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని, గవర్నర్‌ను మా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఆహ్వాన పత్రికలు అందించారు’’ అని సీఎం తెలిపారు.
ప్రతి ఏటా ‘తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం’
తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన సారాంశం.. ‘‘చరిత్ర ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు పవిత్ర శాసనసభలో ప్రకటిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ... నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు. తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వ్యాక్యాలు. ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్ణాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి, లక్ష్యసాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జన బాహుళ్యంలో ఉన్నాయి. వాటిలో దేనికీ ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లేదు. అధికారికంగా మనం గౌరవించుకోలేదు. అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసి, సచివాలయంలో ప్రతిష్ఠించింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు.. నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన సంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుని తీర్చిదిద్దడం జరిగింది.
మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంఠె, గుండు పూసల హారంతో, చెవులకు బుట్ట కమ్మలతో, ముక్క పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాం. కుడి చేతిలో అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతికి, సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దాం. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా ఉంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తుంది.
విగ్రహ రూపకల్పనలో వర్ణాలకు కూడా ప్రత్యేకత, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీల వర్ణం.. గోదావరి, కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ అన్న అందెశ్రీ గీతంలోని వాక్యాలు. ఆకుపచ్చ వర్ణం.. పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగ, ఎరుపు వర్ణం.. మార్పునకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం.. శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనం. తెలంగాణ తల్లి విగ్రహమే కాదు.. మన జాతి ఆత్మగౌరవ ప్రతీక. అస్తిత్వ పతాక. మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక. మన భవిష్యత్తు కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే.. ఇకపై ప్రతి ఏటా డిసెంబరు 9న ‘తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని’ నిర్వహించాలని నిర్ణయించాం. ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. అంత గొప్ప గీతాన్ని మనకు అందించిన రచయిత అందెశ్రీని గౌరవించాం’’.
సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు..
ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సోనియా జన్మదినాన్ని పురస్కరించుకొని అసెంబ్లీలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సభకు రాకుంటే.. ఎమ్మెల్యేలుగా విఫలమైనట్లే!
శాసనసభ్యులు సభకు రాకపోతే.. వారు ఎమ్మెల్యేలుగా విఫలమైనట్లేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి ఒక్క సభ్యుడూ సభకు హాజరై సభలో జరిగే ప్రతి చర్చలో భాగస్వాములు కావాలన్నారు. అందరు సభ్యులూ తమకు నచ్చిన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు అందులో భాగస్వాములై మాట్లాడాలని సూచించారు. సభలో సభ్యులు ఎవరూ నోరు జారొద్దని, హుందాగా మాట్లాడాలని అన్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ‘‘డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యం ఉంది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదినం.. తెలంగాణ ఏర్పాటుకు చిదంబరం ప్రకటనతో పునాది రాయి పడింది ఈ రోజునే. ఇప్పుడు తెలంగాణ తల్లి ఆవిర్భావ ఉత్సవంగానూ డిసెంబరు 9నే గుర్తిస్తున్నాం’’ అని రేవంత్ అన్నారు.