Share News

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:24 AM

మూసీలో మురికిని తొలగించేందుకే ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నవారు..

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

  • మూసీ ప్రక్షాళన చేసి తీరతాం

  • తరాల తరబడి పేదలు మురికిలోనే జీవించాలా?

  • వారి జీవన విధానంలో మార్పు రావద్దా?

  • ఇళ్లు కోల్పోయేవారి బాధలు నాకు తెలియవా?

  • హరీశ్‌, కేటీఆర్‌, ఈటలను వారం రోజులు

  • పేదల మధ్య ఉంచితే సమస్యలు అర్థమవుతాయి

  • రూ.లక్ష కోట్ల కాళేశ్వరం ఏమైందో చూశాం

  • నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాల్ని విస్మరించారు

  • పది నెలల్లో 60 వేల నియామకాలు చేశాం

  • ముఖం చెల్లక కేసీఆర్‌ ఎక్కడున్నారో!: సీఎం

  • 1635 మందికి నియామక పత్రాల అందజేత

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మూసీలో మురికిని తొలగించేందుకే ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది ఆగదని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నవారు.. ఏళ్ల తరబడి మూసీ మురికి కూపంలో జీవిస్తున్న వారి గురించి ఆలోచించాలన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో దుర్భర జీవితం గడుపుతున్న పేదల బాధలు అర్థం చేసుకోరా? తరాలన్నీ మూసీ మురికిలోనే జీవించాలా? వారి జీవన విధానంలో మార్పు రావద్దా? అని ప్రశ్నించారు. తాను జడ్పీటీసీ నుంచి ఇక్కడిదాకా వచ్చానని, పేదల మధ్యనే ఉంటూ.. వారి ఇబ్బందులు తెలుసుకోలేనా? అని అన్నారు. ఇల్లు కోల్పోయిన నిరుపేద కుటుంబాల బాధలు తనకు అర్థమవుతాయన్నారు. ఆదివారం.. రెసిడెన్షియల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, సివిల్‌, ఈఎన్‌సీ, మిషన్‌ భగీరథ, ప్రజారోగ్య, మునిసిపల్‌, గిరిజన సంక్షేమ, ఆర్‌అండ్‌బీ విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అగ్రికల్చర్‌ ఆఫీసర్లు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ పోస్టులకు ఎంపికైన 1,635 మందికి ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.


ఈ సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘గంగా, యమున, సరస్వతి, కావేరి వంటి నదుల పేర్లను మన ఆడబిడ్డలకు పెట్టుకుంటున్నాం. మూసీ నది కంపు కొడుతూ, విషం చిమ్ముతుంది కాబట్టే ఆపేరు ఎవరూ పెట్టుకోవడంలేదు. ఆ మూసీ మురికిని నేను ప్రక్షాళన చేయాలనుకుంటున్నా. ఇందులో యువ ఇంజనీర్లు భాగస్వామ్యమై ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి. గతంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా? మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులను కొట్టించారు కదా? మూసీ పరివాహక ప్రాంతాల్లో పదివేల కుటుంబాలున్నాయి. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహా ఇవ్వండి. నష్ట పరిహారం ఎలా ఇద్దామో చెప్పండి. ఇప్పటికే గుడిసెల్లో ఉన్నవారిని డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లల్లోకి తరలిస్తూ.. దారి ఖర్చులకు కూడా రూ.25 వేలు ఇస్తున్నాం. బఫర్‌ జోన్‌లో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలన్న దానిపై ఆలోచిస్తున్నాం.


  • 10 వేల కోట్లు ఖర్చు చేయగలిగితే..

నువ్వు(కేసీఆర్‌) రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినవ్‌. రూ.5 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లు మూసీలో ఉన్న పేదలకు ఖర్చు చేయగలిగితే.. వాళ్లకు ప్రభుత్వ స్థలాల్లో కాలనీ, అపార్టుమెంట్లు, మంచి ఇళ్లు కట్టించి, హాస్పిటల్‌, పాఠశాలలు, కాలేజీలు కట్టించవచ్చు. మీకు రూ.2 వేల కోట్ల విలువ చేసే వెయ్యెకరాల ఫామ్‌హౌస్‌ ఉంది. మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పార్టీ పెట్టినపుడు 15 రూపాయల్లేవు.. ఇప్పుడు ఇన్ని కోట్లు మీ ఖాతాలకు రావడానికి పేదోళ్ల త్యాగం కారణం కాదా? ఈ ప్రభుత్వం మనందరిది. ఉద్యోగాలు సాధించిన వారంతా బాధ్యతతో పనిచేయండి. మనం చేసే నిర్మాణం పూర్తయితే వాళ్లు చేసిన దోపిడీ అంతా ప్రజలకు తెలుస్తుందని.. ముందుకు సాగనియ్యకుండా ప్రయత్నం చేస్తున్నారు.


బుల్డోజర్‌ నా మీదుగా పోవాలంటే.. నా మీదుగా పోవాలంటూ హరీశ్‌రావు, కేటీఆర్‌.. ఇలా అందరూ పోటీ పడుతున్నారు. మీకోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలె? పైసలు యాడున్నయి? మూసీ అంచున ఉండే దోస్తులకు ఒకటే సూచన. హరీశ్‌, కేటీఆర్‌, రాజేందర్‌ ఎవరైనా వస్తే పట్టుకొని ఒక వారం రోజులు పేదోళ్ల మధ్యన ఉంచండి. వాళ్ల కష్టాలు తెలుస్తయి. వాళ్లకు ఏం మేలు చేయాలో అప్పుడు అర్థమవుతుంది. ఏం చేసినా తప్పుబట్టాలని, కాళ్ల మధ్య కట్టె పెట్టాలని కొంతమంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. మనం పైసలు పెట్టి పని చేస్తే.. తెలంగాణ బాగుపడితే.. గతంలో వాళ్లు చేసిన దోపిడీ ప్రజలకు అర్థమవుతుందని అన్నింటినీ అడ్డుకుంటున్నారు.


  • వందేళ్ల అనుభవం..!

వందేళ్ల అనుభవం ఓవైపు ఉంటే.. పదేళ్ల దుర్మార్గమైన అనుభవం మరోవైపు ఉంది. కాంగ్రెస్‌ పాలనకు, బీఆర్‌ఎస్‌ పాలనకు ఎంతో వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రిన్సిపాళ్లను, పీఈటీలను ఎందుకు నియమించలేదు? 2019 పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వినోద్‌కుమార్‌కు, కవితకు ఆరు నెలలు తిరగకుండానే పదవులు కట్టబెట్టారు. వారి కుటుంబానికి ఒక నీతి, మన కుటుంబాలకు మరో నీతి ప్రదర్శించారు. ఇదే ఆ కుటుంబం రీతి. వివిధ శాఖల్లో కొన్ని ఉద్యోగాలకు 2017లో నోటిఫికేషన్‌ ఇస్తే.. మరికొన్ని రెండేళ్ల కిందట నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ, ఉద్యోగ నియామకాల గురించి మాత్రం పట్టించుకోలేదు.


వివిధ న్యాయస్థానాల్లో కేసులుంటే వాటికి పరిష్కారం చూపించలేకపోయారు. కొందరు ఎనిమిదేళ్లు, మరికొందరు రెండేళ్లుగా నిరీక్షించి గత ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారు. నేనిచ్చిన పిలుపుతో మీరంతా కాంగ్రె్‌సకు అండగా నిలబడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులు.. కాంగ్రెస్‌ కార్యకర్తల కన్నా ఎక్కువగా శ్రమించడం వల్లే 65 మంది ఎమ్మెల్యేలతో అధికారం చేపట్టాం. ఇచ్చిన మాట ప్రకారం.. పదేళ్లలో చేపట్టని నియామకాలకు పరిష్కారం చూపి పది నెలల్లో 60 వేల ఉద్యోగ నియామకాలు పూర్తిచేశాం. యువ ఇంజనీర్ల పర్యవేక్షణంలో 360 కి.మీ రీజనల్‌ రింగ్‌రోడ్డు, రేడియల్‌ రోడ్డు, ఫ్యూచర్‌ సిటీ, ఫార్మాసిటీ నిర్మాణం, మూసీ రివర్‌ డెవల్‌పమెంట్‌ ఫ్రంట్‌ ద్వారా పలు నిర్మాణాలు చేపట్టనున్నాం.


  • ముఖం చెల్లక ఆయనెక్కడున్నారో..?

ప్రతి ఒక్కరూ ముసుగు తొడుక్కుంటారు. ఆయనకు (కేసీఆర్‌ను ఉద్దేశించి) తెలంగాణ అనే ముసుగు.. రక్షణ కవచంలా కొంతకాలం ఉంది. ఉద్యమం కోసం మీరంతా చేతులెత్తి దండం పెట్టారు. అది వారి గొప్పతనం కాదు.. తెలంగాణ ఉద్యమం గొప్పతనం.. విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగం. ఇవాళ ముసుగు తొలగిపోయింది కాబట్టి ముఖం చెల్లక ఆయన ఎక్కడున్నారో! భాక్రానంగల్‌ నుంచి నాగార్జునసాగర్‌, శ్రీశైలం, శ్రీరాంసాగర్‌ వరకు మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సమయంలో కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వర్షాలు పడినా, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు వచ్చినా.. చెక్కుచెదరలేదు. కాళేశ్వరం కడితే ఏం జరిగిందో చూశారు. కాళేశ్వరం కట్టిన వాళ్లను ఆదర్శంగా తీసుకుంటరా? గతంలో నిర్మించిన ప్రాజెక్టుల ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటరా? రూ.38 వేల కోట్ల అంచనాలున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు.. పేరు మారి రూ.లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అయింది. దానికి రూ.లక్ష కోట్లు చెల్లించారు. మూడో టీఎంసీకి ఇంకా పనులు పూర్తికాలేదు. ఇక మల్లన్నసాగర్‌లో రిజర్వాయర్‌ నిర్మించిన చోట భూమిలో వర్టికల్‌ చీలిక ఉందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు చెబుతున్నారు. 50 టీఎంసీల నీళ్లు నింపినరోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పారు. గత ప్రభుత్వం 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు.


  • రాజేందరన్నా వాళ్లకు బానిసత్వం చూపించకు!

అంగి మారినా ఈటల రాజేందర్‌కు ఆ వాసన మాత్రం మారినట్లు కనబడటంలేదు. మంచి పనుల్లో ఆయన కలిసి వస్తారనుకున్నాం. మూసీపై ముందురోజు హరీశ్‌, కేటీఆర్‌ మాట్లాడితే.. మరుసటిరోజు రాజేందర్‌ జిరాక్సు తెచ్చి మాట్లాడారు. కనీసం భాష అయినా మార్చుకో రాజేందరన్నా! ఇంకా వాళ్లకు బానిసత్వం చూపించాల్సిన అవసరంలేదు. వాళ్లు నిన్ను మెడలు పట్టి గెంటేసినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నిల్చున్నది. ఆ దొంగల పక్కన నిల్చోకు. తెలంగాణ ప్రజల పక్కన ఉండు. నేను ఢిల్లీకి వెళ్తున్నా. రేపు మోదీ దగ్గరకు వెళ్దాం.. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కోసం 64 వేల కుటంబాలను ఆయన బయటకు పంపారు. రూ.25 వేల కోట్లు మూసీ రివర్‌ డెవల్‌పమెంట్‌ ప్రంట్‌ కోసం మోదీని అడుగుదాం. ఎందుకియ్యరు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్‌, అన్నీ మీరే గెలిస్తిరి. మీకు బాధ్యతలేదా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 03:24 AM