Share News

CM Revanth Reddy: పార్టీ వీడిన నేతలూ.. తిరిగి రండి

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:30 AM

కాంగ్రెస్‌ పార్టీని వీడిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు తిరిగి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిని చేయాలన్నదే వైఎ్‌సఆర్‌ లక్ష్యమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా తనకు గుర్తున్నాయని తెలిపారు.

CM Revanth Reddy: పార్టీ వీడిన నేతలూ.. తిరిగి రండి

7.jpg

  • రాహుల్‌ను ప్రధానిని చేయాలన్నదే వైఎస్‌ లక్ష్యం.. అది నెరవేరకుండానే ఆయన దూరమయ్యారు

  • ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వైఎస్‌ అభిమానులు సంకల్పించాలి

  • పని చేసినోళ్లకే నామినేటెడ్‌ పదవులిచ్చాం

  • వైఎస్‌ జయంతి కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి

  • అభివృద్ధికి వైఎస్‌ పునాదులు: భట్టి

  • ఆత్మీయతను పంచి అందరి హృదయాల్లో స్థానం: కేవీపీ

హైదరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీని వీడిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు తిరిగి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిని చేయాలన్నదే వైఎ్‌సఆర్‌ లక్ష్యమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా తనకు గుర్తున్నాయని తెలిపారు. కానీ, రాహుల్‌ ప్రధాని కాకమునుపే వైఎస్‌ మనకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి ఎవరైతే పూనుకుంటారో వారే నిజమైన వైఎ్‌సఆర్‌ అభిమానులని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైఎస్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ప్రజా భవన్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ తర్వాత గాంధీ భవన్లో, సీఎల్పీలో కూడా వైఎ్‌సకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తొలుత మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రె్‌సను వీడిన వాళ్లంతా తిరిగి పార్టీలోకి రావాలంటూ పిలుపునిచ్చారు.


ఆ తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి.. భట్టి విక్రమార్క పిలుపును నూటికి నూరు శాతం సమర్థిస్తున్నానని, వైఎ్‌సను అభిమానించే నాయకులంతా తిరిగి కాంగ్రె్‌సలోకి రావాలని కోరారు. ‘‘అందరం కలిసి దేశంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్‌ను ప్రధానిని చేయడానికి కృషి చేద్దాం. దేశంలో సంక్షేమం అంటే గుర్తుకు వచ్చే పేరు వైఎ్‌సఆర్‌. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు స్ఫూర్తి కూడా ఆనాడు వైఎస్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలే. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్‌, హైదరాబాద్‌లో పెట్టుబడులకు కూడా వైఎ్‌సఆరే స్ఫూర్తి. దానిని మా ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తుంది. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు వైఎస్‌ చేసిన పాదయాత్రనే భారత్‌ జోడో యాత్రకు స్ఫూర్తి. ఆ పాదయాత్ర ఉమ్మడి ఏపీలో కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకొస్తే.. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది’’అని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ రాణిస్తున్న తీరు చూస్తుంటే ప్రధాని పదవికి ఆయన ఒక అడుగు దూరంలో ఉన్నారని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ 75వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు రాహుల్‌ను ప్రధానిని చేయాలన్న ప్రతిజ్ఞను తీసుకోవాలన్నారు.


మూడేళ్లలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి పని చేసిన 35 మంది నాయకులకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చామని తెలిపారు. ఎలాంటి పైరవీలు లేకుండా పార్టీ కోసం పని చేసిన, త్యాగం చేసిన వారికే వీటిని ఇచ్చామన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేయడానికి అప్పట్లో వైఎస్‌ఆర్‌ వేసిన పునాదులే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌ పోర్టుతోపాటు ఆయన కల్పించిన మౌలిక సదుపాయాలు ఇప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో ఉండేలా చేశాయని కొనియాడారు. రాబోయే రెండు దశాబ్దాలూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని అన్నారు. వైఎస్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రజల కోసం మరోమారు కలిసి పని చేద్దామని సూచించారు.


వైఎ్‌సఆర్‌ దూరమై దశాబ్దంన్నర అయినా దేశంలో ఆయన పాదముద్రలు కనిపిస్తున్నాయని, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే.. దేశమంతా ఆశ్చర్యపడేలా ఆగస్టు 15కల్లా రుణమాఫీని అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ మాట్లాడుతూ వైఎస్‌ వంటి గొప్ప మనిషిని తాను చూడలేదని, ఇన్నేళ్లు అయినా ప్రజల గుండెల్లో నిలిచిపోవడం గొప్ప విషయమని అన్నారు. 1999లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, పాదయాత్ర చేసి పార్టీని వైఎస్‌ 2004లో అధికారంలోకి తీసుకొచ్చారని ఆయన సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు చెప్పారు. పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, కార్యకర్తలకు మనో ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మీయతా భావాన్ని పంచి అందరి హృదయాల్లో స్థానం సంపాదించారని కొనియాడారు.


ప్రజా భవన్‌లో వైఎ్‌సఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌

వైఎస్‌ జయంతి సందర్భంగా ప్రజా భవన్‌లో రాజశేఖర్‌రెడ్డి ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. దీనిని సీఎం రేవంత్‌ రెడ్డి, దీపాదాస్‌ మున్షీ, కేవీపీ రాంచందర్‌రావు, పార్టీ ఇతర ముఖ్య నేతలు తిలకించారు. వైఎ్‌సతో తమకున్న అనుభవాలను నాయకులు పంచుకున్నారు. ఆనాడు వైఎ్‌సతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న భట్టి విక్రమార్క.. దానికి సంబంధించిన ఫొటోలను చూపిస్తూ ఆనాటి సంఘటనలను వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్రకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణను గుర్తు చేశారు. కాగా.. వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్‌లో ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

Updated Date - Jul 09 , 2024 | 02:30 AM