CM Revanth Reddy: దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక వేవ్!
ABN , Publish Date - May 14 , 2024 | 05:32 AM
దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొడంగల్, మే 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కొడంగల్‌లోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజలకు చేరువైనట్లు చెప్పారు. బీజేపీ సైతం కేంద్ర ప్రభుత్వ పని తీరు, పదేళ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెబుతోందని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లను గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రైతు బంధును రైతుల ఖాతాల్లో జమచేసినట్లే పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.5 శాతం ఓట్లు రాగా పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించి వస్తాయన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తుండగా 400 సీట్లు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రధాని మోదీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని, సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. నవనీత్ కౌర్ 15 సెకన్ల కామెంట్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతూ పెట్టుబడులను గుజరాత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా కేఏ పాల్‌లాగే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు